కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఎక్కడంటే?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం సభ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తర్వాత సభ విశాఖలో పెట్టాలని నిర్ణయించుకున్నారు

Update: 2023-01-19 07:41 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం సభ సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తర్వాత సభ విశాఖలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. విశాఖ సభకు కూడా జాతీయ నేతలను ఆహ్వానించే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ కు భారీ మద్దతు ఉందని తెలియజేయడానికి ఈ సభను ప్రధానంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖ సభను కూడా ఖమ్మం తరహాలోనే సక్సెస్ చేయాలని ఏపీ నేతలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేయాలని తెలిపినట్లు సమాచారం.


దక్షిణాదిలో బలంగా...

బీఆర్ఎస్ తొలుత దక్షిణాదిలో ఒక బలమైన పార్టీగా ముద్ర వేసుకునే పనిలో ఉన్నారు కేసీఆర్. దక్షిణాదిలోనే ఎలాంటి బలం లేకపోతే ఇక ఉత్తరాది వెళ్లి ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని భావించి సౌత్ పై ప్రధానంగా కేసీఆర్ ఫోకస్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ సభకు ఖమ్మం వచ్చిన నేతలు కాకుండా మరికొందరు జాతీయ నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఏపీ సభలో మేధావులు, మాజీ ఐఏఎస్ అధికారులను కూడా రప్పించి వారి చేత సందేశాలు ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్...
ఇక కర్ణాటకలో ఏటూ జేడీఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయించారు. జేడీఎస్ మద్దతుతో కన్నడ రాష్ట్రంలోని కొన్ని చోట్ల పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ పోటీపై అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారని తెలిసింది. కర్ణాటక బీఆర్ఎస్ అధ్యక్షుడిగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను నియమించే అవకాశాలున్నాయంటున్నారు. విశాఖపట్నం సభ తర్వాత కర్ణాటకలో కూడా భారీ సభను ఏర్పాటు చేసి ప్రకాష్ రాజ్ కు అక్కడ పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరుగుతుండటంతో జేడీఎస్ తో కలసి పోటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.

జేడీఎస్ తో కలసి...
ఇప్పటికే బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాలకు జేడీఎస్ నేత కుమారస్వామి వచ్చిన సంగతి తెలిసిందే. కుమారస్వామితో టచ్ లో ఉన్న కేసీఆర్ కర్ణాటకలో జేడీఎస్ - బీఆర్ఎస్ సంయుక్త సభను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. దీనిపై ఇప్పటికే కుమారస్వామితో కూడా చర్చించినట్లు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కన్నడ నాట సభ ఎక్కడ పెడితే బాగుంటుందన్న విషయాన్ని కుమారస్వామికే వదిలేశారని అంటున్నారు. కన్నడ నాట తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సభ పెడితే బాగుంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఖమ్మం నుంచి విశాఖ మీదుగా కన్నడ రాష్ట్రానికి కేసీఆర్ వెళతారంటూ గులాబీ పార్టీలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా తేదీలు ఖరారు కావాల్సి ఉంది.


Tags:    

Similar News