కలెక్టర్ కి బీరు ప్రియుడి వెరైటీ వినతి

Update: 2018-09-25 10:02 GMT

తెలంగాణలోని జిల్లాల్లో ప్రతి సోమవారం కలెక్టర్లు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా పరిధిలోని ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ ను కలిసి వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యను చెప్పుకుంటారు. అయితే, జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వచ్చిన ఓ ఫిర్యాదు ఆశ్చర్యకరంగా ఉంది. జగిత్యాలకు చెందిన అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి సోమవారం కలెక్టర్ కు ఓ ఫిర్యాదు చేశారు. యువత, బీరు ప్రియులు ఎక్కువగా ఇష్టపడే ‘కింగ్ ఫిషర్’ బీరును జగిత్యాలలో విక్రయించడం లేదనేది ఇందులో ఆరోపణ. లిక్కర్ వ్యాపారులు సిండికేట్ గా మారి తమకు ఇష్టమైన బీరు కాకుండా నాసిరకం బీర్లు అమ్ముతున్నారని ఆరోపించారు.

హక్కుకు భంగం కలిగిస్తున్నారు.

అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ -19 ద్వారా సంక్రమించిన స్వచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం వ్యాపారులు భంగం కలిగిస్తున్నారని సైతం ఆరోపించారు. మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకుని ఈ నెల నుంచి తమకు ఇష్టమైన ‘కింగ్ ఫీషర్’ బీరును అందుబాటులోకి తేవాలని విన్నవించారు. మొత్తానికి సూర్యనారాయణ ఫిర్యాదు చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదును కలెక్టర్ ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు.

Similar News