యాంకర్ రవి దాడి ఎందుకు చేశాడు....?

Update: 2018-10-28 02:09 GMT

ప్రముఖ టీవి యాంకర్ రవి దాడికి పాల్పడ్డాడంటూ ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ పోలీసులను ఆశ్రయించాడు. తన బాకీ తీర్చాలంటూ యాంకర్ రవి తన అనుచరులతో కలిసి వీరంగం చేశాడు. రవిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నాడు. డిస్ట్రిబ్యూటర్ సందీప్ తో యాంకర్ రవికు ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. తీసుకున్న బాకీని సందీప్ చెల్లించకపోవడంతో కోపోద్రిక్తుడయ్యాడు రవి. అప్పు తీర్చకుంటే అంతు చూస్తానంటూ రవి తన అనుచరులతో కలిసి కమలాపురికాలనీలోని సందీప్ కార్యాలయంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఇనుపరాడ్లతో 20 మంది వ్యక్తులు వచ్చి తనను బెదిరింపులకు గురిచేశారని.. ఫోన్ లో కూడా రవి దూషించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సందీప్. సందీప్ నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్.ఆర్. నగర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. యాంకర్ రవిని అదుపులోకి తీసుకుని కొద్దిసేపు విచారించారు. ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అవసరమైతే విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పి యాంకర్ రవిని వదిలిపెట్టారు పోలీసులు. యాంకర్ రవి తన డిస్ట్రిబ్యూషన్ కార్యాలయంలో గొడవకు దిగిన వీడియో ఫుటేజ్ ని త్వరలోనే బయటపెడ్తానంటున్నాడు డిస్ట్రిబ్యూటర్ సందీప్. తన ప్రాణానికి ముప్పు ఉందని.. యాంకర్ రవి నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నాడు బాధితుడు సందీప్.

Similar News