కుమారుడి ఆచూకీ కోసం..

Update: 2018-06-23 08:05 GMT

అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఒక్కగానొక్క కుమారుడి ఆచూకీ తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పి.బంగారం కుమారుడు రాఘవేంద్రరావు(36) లండన్ లో ఎంటెక్ పూర్తి చేశాడు. అనంతరం 2011లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లాడు. మెక్రోసాఫ్ట్ లో ఉద్యోగంలో చేరి మంచి స్థానంలో ఉన్నాడు. అయితే, గత సంవత్సరం అక్టోబరు 21వ వరకు తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడిన ఆయన ఆచూకీ అప్పటి నుంచి తెలియడం లేదు. అమెరికాలో స్నేహితులకు కూడా రాఘవేంద్రరావు ఎటు వెళ్లాడో తెలియడం లేదు. చివరగా తల్లిదండ్రులతో ఫోన్ లో మట్లాడిన రాఘవేంద్రరావు..‘అందరం కలిసి ఉందామని, త్వరలోనే తిరిగి వస్తానని’ చెప్పాడు.

ఏడు నెలల నుంచి....

అప్పటి నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేయలేదు. అంతకుముందు కూచిపూడి శ్రీనివాస్ ను అమెరికాలో హత్య చేసిన సమయంలో కూడా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. తాను ఉంటున్న ప్రాంతం హైదరాబాద్ లానే ఉంటుందని, ఎటువంటి ఆందోళన పడవద్దని వారికి భరోసా ఇచ్చాడు. ఇంత ధైర్యంగా ఉన్న కుమారుడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుమారుడి గురించి తెలుసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని వారు కోరారు. ఎంబీటీ పార్టీ నేత అమ్జదాల్లా ఖాన్ కూడా ఈ తల్లిదండ్రుల ఆవేదనను సోషల్ మీడియాలో సుష్మా స్వరాజ్ కు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు. స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

Similar News