52 మంది భారతీయులకు అమెరికాలో అగచాట్లు

Update: 2018-06-20 11:22 GMT

అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన ఆశ్రయం పొందడానికి ప్రయత్నిస్తున్న 52 మంది భారతీయులను అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది సిక్కులు, క్రిస్టియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మెక్సికో నుంచి పెద్ద ఎత్తున అమెరికాలోకి అక్రమంగా వలసదారులు ప్రవేశిస్తున్నారు. వీరిని అడ్డుకునేందుకు అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా, మెక్సికో సరిహద్దులో గోడ కూడా కట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఒరేగాన్ రాష్ట్రంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నిస్తున్న 123 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 52 మంది భారతీయులు ఉన్నారు. మిగతావారు చైనా, మెక్సికో, నేపాల్, పాకిస్థాన్, ఉక్రెయిన్ వంటి దేశాలకు చెందినవారున్నారు.

బందీలుగా మారి.....

అయితే, అమెరికాలో బందీలుగా ఉన్న వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. రోజులో 23 గంటల పాటు చిన్న గదిలో ముగ్గురి చొప్పున ఉంచుతున్నారని బందీలు ఆరోపిస్తున్నారు. దేశంలో అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించాల్సిందేనని ఆ దేశ అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యవాదులతోనే దేశానికి సమస్యలు వస్తున్నాయని, దేశంలోకి వలసదారులు అక్రమంగా చొరబడి చేసే ఆకృత్యాలు, అరాచకాలు వీరికి పట్టడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా విమర్శించారు. అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన పిల్లలు పెద్దసంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటికే ఇలా వచ్చి 12 వేల మంది పిల్లలు ఫెడరల్ ఏజెన్సీకి చిక్కారు. వీరంతా నిర్భంద కేంద్రాల్లో ఉంటున్నారు. వీరిలో 10 వేల మందిని వారి తల్లిదండ్రులే దేశంలోకి తరలించినట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.

Similar News