స్పీడు పెంచిన కమలం.. ఆ రోజే తొలి జాబితా!

తెలంగాణలో ఎన్నికల జోష్‌ పెరిగిపోయింది. వివిధ పార్టీల నేతలు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో..

Update: 2023-10-12 02:43 GMT

తెలంగాణలో ఎన్నికల జోష్‌ పెరిగిపోయింది. వివిధ పార్టీల నేతలు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభలు, నేతల ప్రచారాలతో పార్టీలో జోష్‌ ఉండేలా ప్లాన్‌లు చేస్తున్నారు. నేతల భేటీలు పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే బీజేపీ స్పీడ్‌ పెంచింది. అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మొదటి జాబితాపై కసరత్తు పూర్తి అయిందని.. త్వరలోనే పార్టీ అధిష్టానం విడుదల చేస్తుందని కాషాయం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరికలపై కూడా ఫోకస్‌ పెట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. టీ బీజేపీ నేతలకు సూచించడంతో కీలక నేతలంతా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇతర పార్టీల్లో పేరున్న నేతలకు గాలం వేస్తున్నారు. ఆదిలాబాద్, సికింద్రాబాద్ లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్ర హోమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా.. మొన్న గంటపాటు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమయంలో చేరికలు, మేనిఫెస్టోపై దృష్టి పెట్టాలని సూచించారు. దీంతోపాటు తెలంగాణలో వరుస సభలకు ప్లాన్‌ సిద్ధం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

జాబితా తయారీలో స్పీడ్‌ పెంచిన కమలం:

ఇక అమిత్‌ షాతో కిషన్‌ రెడ్డి, ప్రకాశ్‌ జవదేకర్‌.. ప్రత్యేకంగా సమావేశం అయిన తర్వాత పార్టీ మరింతగా స్పీడ్‌ పెంచేసింది. ఎన్నికల్లో బలమైన నేతలను రంగంలోకి దింపాలని అమిత్‌షా సూచించడంతో కీలక నేతలు వారిపైనే దృష్టి సారిస్తున్నారు. ఇక స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని నియమించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మొదటి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ.. ఈ నెల 15వ తేదీన తొలి జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మూడు విడతల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా తొలి జాబితా విడుదల తర్వాత దసరా రోజు 40 మందితో రెండో జాబితా ఉంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ జాబితా తర్వాత బీజేపీ మూడో లిస్ట్‌ వస్తుందని తెలుస్తోంది.

హైదరాబాద్‌కు మరోసారి మోడీ రానున్నారా..?

అయితే నవంబర్‌ చివరివారంలో ప్రధాన నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు తరహాలో మోడీ భారీ రోడ్‌ షో నిర్వహించేలా బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేది తామేనంటు చెబుతున్న బీజేపీ.. ఎలాంటి ప్లాన్స్‌ వేస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News