Congress : డిసిషన్ ఛేంజ్ చేసుకుంది అందుకేనా... ఆ ప్రమాదం ఉందనేనా?

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 64 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

Update: 2023-12-03 14:12 GMT

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 64 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తరువాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కు పంపారు. ఆమె కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఆయన ఇప్పట్లో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్ ఆపదర్హర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా? అన్నది కూడా పెద్ద యెత్తున చర్చ జరుగుతుంది.

ఈరోజే సీఎల్పీ...
ఇక కాంగ్రెస్ కూడా మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసింది. గెలిచిన అభ్యర్థులందరూ ఒక్కొక్కరూ హోటల్ కు చేరుకుంటున్నారు. సీఎల్పీ సమావేశమై తమ నేత పేరును ఏకగీవ్రంగా ఆమోదించి హైకమాండ్ కు తీర్మానాన్ని పంపనుంది. రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన రేవంత్ పేరునే ఎక్కువ మంది చెబుతారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మల్లు భట్టి విక్రమార్కను నియమించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గాని ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
డిసెంబరు 9న అంటూ...
తొలి నుంచి డిసెంబరు 9న సోనియా గాంధీ పుట్టిన రోజు నాడు ఎల్.బి. స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయాలని భావించారు. పదే పదే అదే డేట్ ను పీసీసీ చీఫ్ గా రేవంత్ ప్రకటించారు కూడా. కానీ ఉన్నట్లుండి రేపు ప్రమాణ స్వీకారం అని వార్తలు రావడానికి అనేకకారణాలున్నాయంటున్నారు. గెలిచిన సీట్లు 64 మాత్రమే కావడం ఒకటయితే... అన్నింటికంటే ముఖ్యం నిధులు పక్క దారి పట్టే అవకాశముందని భావించడమే. కౌంటింగ్ కు ముందుగానే ఎన్నికల అధికారులను కలిసిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆరు వేల కోట్ల రూపాయల బిల్లులను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం చేస్తే నిధులు మాయం చేసి ఆర్థిక ఇబ్బందులు తప్పవన్న భయం కాంగ్రెస్ నేతల్లో పట్టుకుంది.
రిజల్ట్ తర్వాత...
అందుకనే హడావిడిగా కాంగ్రెస్ రిజల్ట్ తర్వాత ముహూర్తాన్ని మార్చుకున్నారు. ముందుగానే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. నిధులు పక్క దారి పట్టకుండా, బీఆర్ఎస్ అనుయాయుల జేబుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వ ఏర్పాటును తక్షణమే చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ కు కూడా చెప్పడంతో అక్కడి నుంచి ఓకే రావడంతో రాత్రికి రాత్రికి సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసి నేతను ఎన్నుకోనున్నారు. రేపు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరతారు. వెనువెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News