Paleru : శ్రీమంతుల మధ్య సమరం... కానీ గెలుపోటములు మాత్రం?

పాలేరు నియోజకవర్గంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతుంది.

Update: 2023-11-28 08:26 GMT

తెలంగాణ ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే బిగ్ ఫైట్ అనేక చోట్ల జరుగుతున్నా ప్రతిష్టాత్మకమైన పోరు పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. ఇక్కడ మిలియనీర్లు పోటీ పడుతుండటమే. కరెన్సీ కట్టలు కట్టలుగా బయట పడుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు అభ్యర్థులు శ్రీమంతులే. ఈ ఎన్నికల్లో గెలుపును వారు సీరియస్ గా తీసుకున్నారు. ఇద్దరూ పార్టీలు మారిన వాళ్లే. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారే. కానీ పోటీ మాత్రం సూపర్. అక్కడ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరి ఓటు చీలుస్తారన్న టెన్షన్ ఇప్పుడు ఇరు పార్టీల నేతలకు పట్టుకుంది. రాష్ట్రమంతటా పాలేరు వైపు చూస్తుంది.

ఒక్కసారి మాత్రమే...
పాలేరులో పోటీ మామూలుగా లేదు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత బీఆర్ఎస్ లోకి మారారు. ఆయన తాను చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. డబ్బులు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈసారి గెలిస్తే తనకు కేసీఆర్ కేబినెట్ లో స్థానం అని ప్రచారం కూడా ఆయన చేసుకుంటున్నారంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుంది. రెండోసారి తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. అదీ 2016 ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు.
గెలుపుపై హోప్స్...
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పటిష్టమైన ఓటు బ్యాంకు ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అడ్డాగా అని చెప్పాలి. రెడ్డి సామాజికవర్గంతో పాటు షెడ్యూలు కులాలు, తెగలు ఇక్కడ అధికంగా ఉండటంతో కాంగ్రెస్ వైపు జనం అత్యధిక సార్లు మొగ్గు చూపుతూ వస్తున్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన గెలుపుపై హోప్స్ పెట్టుకున్నారు. పొంగులేటి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. పొంగులేటి కూడా పిచ్చి పిచ్చిగా ఖర్చు చేస్తున్నారు. ఆయనకు సింబల్ అడ్వాంటేజీగా మారనుంది. ఖమ్మం జిల్లా కావడంతో మరింత అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి ఈసారి శాసనసభలో అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన కూడా పొంగులేటి తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు.
స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న కామ్రేడ్లు...
మరోవైపు డబ్బులతో సంబంధం లేకుండా కేవలం పార్టీ గుర్తుపైనా, వ్యక్తిగత ప్రతిష్టతోనే పోటీ చేస్తున్న తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ తలపడుతున్నారు. ఇక్కడ వామపక్ష పార్టీలకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. 1983,1985,1994 ఎన్నికల్లో ఇక్కడి నుంచి సీపీఎం అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే కాంగ్రెస్ తో జతకట్టాలని తొలుత భావించి సీట్ల సర్దుబాటు కాకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ వెంట ఉంది. మరి సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం ఎవరి ఓట్లను చీలుస్తారన్న దానిపై వారి గెలుపు ఆధారపడి ఉంటుందన్న లెక్కలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ముగ్గురు అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో పరిచయం ఉన్న నేతలు కావడంతో ఇక్కడ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెద్దయెత్తున బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయి. మరి గెలుపు ఎవరదిన్నది మాత్రం డిసెంబరు మూడోతేదీ వరకూ వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News