Telangana: ఇక క్లయిమాక్స్‌కు చేరింది.. అదరగొట్టే రేంజ్‌లో ఆఖరి పోరాటం

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల వార్‌ పీక్స్‌లో కొనసాగుతోంది. ప్రచార పర్వంలో క్లయిమాక్స్..

Update: 2023-11-23 02:10 GMT

Telangana Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల వార్‌ పీక్స్‌లో కొనసాగుతోంది. ప్రచార పర్వంలో క్లయిమాక్స్ అదరగొట్టే రేంజ్‌లో ఉండబోతోంది. ఆఖరివారం అగ్రనేతలంతా తెలంగాణ బటపట్టారు. ముఖ్యంగా ఆ నలుగురు లీడర్లూ ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీల మీద ఫోకస్ చేశారు. మిషన్ తెలంగాణ కోసం ఆఖరిపోరాటం చేయబోతున్నారు.తిప్పికొడితే వారం రోజులు కూడా లేవు పోలింగ్ తేదీకి. కానీ.. ఈ ప్రచార రోజుల్లో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ ముగిసిపోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే.. ఇలా ప్రధాన పార్టీల జాతీయ నేతలంతా ఈనెల 24 నుంచి తెలంగాణ మీదే టార్గెట్ చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో తెలంగాణ గల్లీల్లో హోరెత్తించనున్నారు. ఇప్పటి వరకు ఒక లేక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు ఈ వారం రోజుల్లో ప్రచారాలు కొనసాగనున్నాయి.

ప్రధాని మోదీ ఈ శనివారం హైదరాబాద్‌కి రానున్నారు. మూడురోజుల పాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 25న కామారెడ్డి, మహేశ్వరం, 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్‌లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 24 నుంచి 28 వరకు హోమ్‌ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలోనే ఉంటారు. ముగ్గురు బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేస్తారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ సిద్ధంగా ఉన్నాయి.

అటు... రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా 24 నుంచి ప్రచారఘట్టం ముగిసేవరకు తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి నియోజకవర్గాల్లో, 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, 27న మునుగోడు, దేవరకొండ, గద్వాల సభల్లో ప్రసంగిస్తారు ప్రియాంకా గాంధీ. ఇక కామ్రేడ్ల తరఫున జాతీయ నేతలు సీతారాం ఏచూరి, బృందాకారత్ ముమ్మరంగా ప్రచారం చేస్తారు. ఇలా.. చివరి నాలుగురోజులూ వీరోచితంగా ప్రచారం చేస్తూ ఓట్ల వేటలో బిజీ కాబోతున్నారు జాతీయ నేతలు.

అటు... బీజేపీ, కాంగ్రెస్‌లకు దీటుగా ప్రజా ఆశీర్వాద సభలతో హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్. 25న హైదరాబాద్ బహిరంగసభలో పాల్గొంటారు. 28న వరంగల్, గజ్వేల్ సభలతో ప్రచార అంకానికి ఫుల్‌ స్టాప్ పెడతారు. అటు.. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూకట్‌పల్లిలో అమిత్‌షాతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. సో.. ఢిల్లీ నుంచి గల్లీ దాక రాష్ట్రంలో చివరి ఘట్టంలో ప్రచారంలో మునిగి తేలనున్నారు.

Tags:    

Similar News