Telangana Elections : ఇద్దరు మాజీ సీఎంల ముద్దుల కొడుకులు గెలుస్తారా? వారి గ్రాఫ్ ఎలా ఉంది?

ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. వారి గెలుపోటములపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.

Update: 2023-11-24 13:17 GMT

ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు అంటే దాదాపు రాజకీయంగా అనుభవాన్ని, క్యాడర్ ను సంపాదించుకున్నట్లే. తమకంటూ ఒక వర్గాన్ని ముఖ్యమంత్రులు అందరూ ఏర్పాటు చేసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేయడం అంటే మామూలు విష‍యం కాదు. అందులోనూ అంత పెద్ద పదవిలో ఉండి తమ తనయులను వారసులుగా తీసుకు వచ్చేందుకు వాళ్లేమీ ప్రయత్నాలు చేయాల్సిన పనిలేదు. ఆటోమేటిక్ గా జనం ఆదరిస్తారు. వారంతట వారే రాజకీయాల్లో రాటు దేలుతారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకుల రాజకీయ భవితవ్యం పై చర్చ జరుగుతుంది. అంతేకాదు ఇద్దరూ తన తండ్రులను ముఖ్యమంత్రులను చేసిన కాంగ్రెస్ లో ఇమడలేకపోయారు. ఇతర పార్టీల్లో చేరి ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారు ఈసారైనా తండ్రుల ప్రతిష్టను నిలబెడతారా? లేదా? అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారి గెలుపోటములపై "తెలుగు పోస్ట్" ఫోకస్.

ముఖ్యమంత్రిగా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మర్రి చెన్నారెడ్డి అంటే ఎవరికీ తెలియని వారుండరు. కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగారు. 1978 కాంగ్రెస్ చీలిక సమయంలో మర్రి చెన్నారెడ్డి ఇందిరాగాంధీ వర్గంలో చేరి సమైక్య ఇందిర కాంగ్రెస్ కు నాయకత్వం వహించారు. దాదాపు 175 నియోజకవర్గాల్లో పార్టీకి సీట్లు తెచ్చి అధికారంలోకి తెచ్చారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమారుడు మర్రిశశిధర్ రెడ్డి ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగారు. జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ సంస్థ ఛైర్మన్ గా పని చేశారు. ఈ మధ్యనే ఆయన కాంగ్రెస్ నాయకత్వంతో విసిగి బీజేపీలో చేరిపోయారు. సనత్ నగర్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. విద్యావంతుడు అయితే సనత్ నగర్ లో ముక్కోణపు పోటీ జరుగుతుంది. సౌమ్యుడిగా పేరున్న మర్రి శశిధర్ రెడ్డి ఈసారి గెలుస్తారా? లేదా? అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి. ప్రజలు ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఓటేస్తారని ఆయనను దగ్గరుండి చూసిన వాళ్లు చెబుతున్నారు.
ముక్కోణపు పోటీలో...
మర్రి శశిధర్ రెడ్డి 1992లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన సనత్ నియోజకవర్గం నుంచే గెలిచారు. 1994లోనూ అదే నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. తిరిగి 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌పై గెలిచారు. 2009లోనూ ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఆయనకు గెలుపు దక్కలేదు. 2014లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కలేదు. ఈసారి ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ను, కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమను ఢీకొట్టబోతున్నారు. మంచి ఫైట్ జరగబోతుందన్నది యదార్థం. మర్రి శశిధర్ రెడ్డి మాత్రం ఈసారి తనను ప్రజలు ఆశీర్వదిస్తారని, మోదీ ఇమేజ్ తో పాటు తన తండ్రి చరిష్మా కూడా పనిచేస్తుందని భావిస్తున్నారు.
అమెరికాలో చదివి...
ఇక మరో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గురించి చెప్పుకోకుండా ఉండలేం. ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి కీలక నేతగా వ్యవహరించారు.కొన్నాళ్లు పార్టీకి దూరమయినా 1984లో కాంగ్రెస్ కు తిరిగి వచ్చి 1984, 1991 లో రెండుసార్లు ఖమ్మం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1986 నుంచి 1989 వరకూ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జలగం వెంగళరావు మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరుంది. ఆయన గురించి ఈ తరం రాజకీయ నేతలు కూడా మననం చేసుకుంటారు. ఆ జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు ఇప్పుడు కొత్తగూడెం ఎన్నికల బరిలో ఉన్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వెంకట్రావు 2004లో కాంగ్రెస్ నుంచి సత్తుపల్లికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన సోదరుడు ప్రసాదరావు, తండ్రి వెంకట్రావులు కొన్ని దశాబ్దాల పాటు సత్తుపల్లికి ఎమ్మెల్యేగా కొనసాగారు.
అదే నమ్మకం...
2014లో జలగం వెంకట్రావు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. మొన్నటి వరకూ బీఆర్ఎస్ లో కొనసాగిన వెంకట్రావు ఈ ఎన్నికల్లో టిక్కెట్ దక్కక పోవడంతో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరదామని భావించినా పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో జంప్ చేసిన వనమా వెంకటేశ్వరరావుకు టిక్కెట్ కన్ఫర్మ్ చేసింది దీంతో ఇక్కడ పోటీ రసకందాయంలో పడింది. ఇటు బీఆర్ఎస్ ఓట్లు, అటు కాంగ్రెస్ ఓట్లు తనకే పడి తన విజయం ఖాయమని జలగం వెంకట్రావు నమ్ముతున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.



Tags:    

Similar News