Congress : హనుమంతన్న గంతులు.. ఊగిపోతున్నారుగా

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు పార్టీ అగ్రనాయకత్వపై ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2023-10-22 13:37 GMT

కాంగ్రెస్‌కు శత్రువులు ఎక్కడో లేరు. పార్టీలోనే నేతల రూపంలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడే సమయంలో లీడర్లే పార్టీని ఇబ్బందులు పెడుతుంటారు. మొన్న పొన్నాల.. నేడు విహెచ్. గాంధీ భవన్ లో కూర్చుని మరీ పార్టీ అగ్రనాయకత్వంపై విమర్శలు చేయడం వారికే చెల్లుబాటు అవుతుంది. వీహెచ్ హనుమంతరావు చేసిన సీరియస్ కామెంట్స్ ఇప్పుడు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయనే అనుకోవాలి. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎన్నికల సమయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉత్తమ్ తనను రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఉత్తమ్ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.

అంబర్‌పేట్ టిక్కెట్...
అంబర్‌పేట్ సీటు విష‍యంలో వీ. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అడ్డా అంబర్ పేట్ అంటున్న ఆయన అక్కడ లక్ష్మణ్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వాలని తాను సిఫార్సు చేస్తే ఆయనను కాదని ఉత్తమ్ మరొక వ్యక్తికి సీటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తనను, జగ్గారెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను గాంధీ కుటుంబానికి వీరవిధేయుడంటూనే తాను అంబర్‌పేట్‌లో వేరొకరికి టిక్కట్ ఇస్తే ఎలా చేస్తానని కూడా ఆయన ప్రశ్నించారు. పొన్నాల వివాదం ముగియక ముందే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో వీహెచ్ ఆగ్రహం ఇప్పుడు ఇబ్బందిగా మారింది.
తాను సిఫార్సు చేసిన...
అంబర్ పేట్ సీటు కోసం వి. హనుమంతరావు లక్ష్మణ్ యాదవ్ పేరును సిఫార్సు చేశారు. అయితే ఉత్తమ్ వేరొక అభ్యర్థి పేరును ప్రతిపాదించారు. అదీ తనపై ఎస్సీ, ఎస్టీ నమోదు చేసిన వారిని ఉత్తమ్ ఎంకరేజ్ చేస్తున్నాడని వీహెచ్ ఆరోపిస్తున్నారు. తనకు అంబర్ పేట్‌లో ఉన్న బలాన్ని, బలగాన్ని కూడా పార్టీ గుర్తించకపోవడం విచారకరమన్న ఆయన తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. బీసీలకు అన్యాయం చేస్తే పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. నా అంబర్ పేట్ సీటు వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పడ్డారో చెప్పాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి రెండు టిక్కెట్లు తెచ్చుకోవచ్చు కాని, తమలాంటి సీనియర్ నేత సిఫార్సు చేసిన ఒక్క సీటు కూడా ఇవ్వరా? అంటూ ఆయన ప్రశ్నించారు.
రెండో జాబితా బయటకు వస్తే...?
కాగా కాంగ్రెస్ రెండో జాబితా ఇంకా బయటకు రాలేదు. తమకు అందిన సమాచారాన్ని బట్టి ఆయన అంబర్‌పేట్ సీటు తాను సిఫార్సు చేసిన అభ్యర్థికి దక్కే అవకాశం లేదని భావించి ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కార్యాలయంలో కూర్చుని మరీ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండో జాబితా బయటకు రాగానే ఇంకెన్ని విభేదాలు బయటపడతాయా? అన్న టెన్షన్ పార్టీలో నెలకొంది. ఇప్పటికి 55 టిక్కెట్లను మాత్రమే కాంగ్రెస్ తొలి జాబితాలో ప్రకటించింది. ఇంకా అరవైకి పైగా సీట్లను ప్రకటించాల్సి ఉండగా సీట్లు దక్కని అభ్యర్థులందరూ గాంధీభవన్ పై దండయాత్ర చేస్తారన్న బెంగ కాంగ్రెస్ అగ్రనేతలకు పట్టుకుంది. మరి దీన్నుంచి ఎలా బయటపడతారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News