Telangana Elections Polling : పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ అత్యధికంగానే నమోదయింది. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది

Update: 2023-11-30 11:44 GMT

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ అత్యధికంగానే నమోదయింది. దాదాపు 70 శాతానికి పైగానే పోలింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ పోలింగ్ జరిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న చర్చ జరుగుతుంది. పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా అన్ని పార్టీలూ ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటుంటాయి. అందుకే పోలింగ్ శాతం పెరగడంపై కూడా అంచనాలు అనేకం వస్తుంటాయి. సైలెంట్ ఓటింగ్ కూడా పోలింగ్ శాతం పెరగడానికి కారణమని చెప్పాలి. సైలెంట్ వేవ్ ప్రకారం పోలింగ్ జరిగిందంటే అది ఏ పార్టీకి లాభం? అధికారంలో ఉన్న పార్టీకా? లేక ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకా? అన్నది మాత్రం ఎవరి ఊహలు వారివే.

తమకు లాభం...
సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అధికార పార్టీకి కొంత వ్యతిరేకత ఉందని విపక్ష పార్టీలు చెబుతుంటాయి. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడుగట్టుకుని ఉండి ఓట్ల రూపంలో బయటపడుతుందన్నది ఒకరి అంచనా. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం వల్లనే పెద్దయెత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని విపక్ష నేతలు తమ అభిప్రాయంగా చెబుతారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటం, తమ సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధ చూపకపోవడం తోనే ప్రజలు ఆగ్రహానికి గురై ఎక్కువ మంది పోలింగ్ కు హాజరయ్యారన్నది విపక్షాలు చెబుతున్నాయి. తాము ఇచ్చిన హామీలు కూడా పనిచేయడం వల్లనే ఎక్కువ మంది పోలింగ్ కు వచ్చి తమకు మద్దతుగా నిలిచారని విపక్ష పార్టీలు తమకు తాము సర్ది చెప్పుకుంటాయి.
తమకే మద్దతు...
అలాగే అధికార పార్టీ కూడా అంతే. పోలింగ్ శాతం పెరగడం వల్ల తమకే లాభం అన్న వాదనలు కూడా లేకపోలేదు. చేసిన అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసినందున మరోసారి తమకు అవకాశమివ్వాలన్న ఉద్దేశ్యంతో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారని అధికారంలో ఉన్న పార్టీ చెబుతుంది. వేరొకరికి అధికారాన్ని ఇస్తే అభివృద్ధికి కామా పడే అవకాశముందని, అందుకే తమను మరోసారి ఆశీర్వదించేందుకు ఓటర్లు నిర్ణయించుకున్నారని, అందుకే పోలింగ్ కు పోటెత్తారని అధికార పక్షం సహజంగా వాదిస్తుంది. మరి ఈ రెండు వాదనలను తోసిపుచ్చలేం. కానీ ఎవరిది గెలుపు అన్నది తెలియడానికి మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News