MIM : కాంగ్రెస్ ను ఓడించడమెలా? జూబ్లీహిల్స్‌లో పోటీ వెనక అసలు కారణమిదే

తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది. జూబ్లీహిల్స్ లో పోటీ వెనక ప్రత్యేక కారణముంది

Update: 2023-11-03 12:35 GMT

తొమ్మిది స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని నిర్ణయించింది. బహదూర్ పుర, నాంపల్లి, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్, యాకుత్ పుర, చంద్రాయణ గుట్ట, చార్మినార్, మలక్ పేట్, కార్వాన్ లలో పోటీ చేయాలని డిసైడ్ చేసింది. అయితే మిగిలిన ఎనిమిది స్థానాలను అటు ఉంచితే ఇప్పుడు జూబ్లీహిల్స్ పైనే పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అక్కడ ఎంఐఎం పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకారం అందించడానికేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

ప్రత్యేకత ఇదే...
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతమంది ధనికులున్నారో.. అంతకంటే పేదలు కూడా అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీలో కొంత భాగం, షేక్‌ పేట వంటివి వస్తాయి. ఇక్కడ ముస్లిం జనాభా అధికంగా ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
2014లో దూరంగా...
2018 ఎన్నికల్లోనూ మాగంటి గోపీనాధ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. పదహారు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై గెలిచారు. 2014లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన ఎంఐఎం 2018లో మాత్రం పోటీ చేయలేదు. అదే బీఆర్ఎస్ గెలుపునకు కారణమయిందన్న విశ్లేషణలున్నాయి. 2014లో మాత్రం ఎంఐఎం పోటీ జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసింది. అప్పడు 41 వేల ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచిదంటే అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ముస్లిం ఓటర్లు ఈ నియోజకవర్గంలో కీలక భూమిక పోషిస్తారన్నది కాదనలేని వాస్తవం.
కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకే...
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అజారుద్దీన్ ను బరిలోకి దింపింది. ఆ నియోజకవర్గంలో ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఓట్లు అధిక సంఖ్యలో ఉన్నాయి. పైగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాధ్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆయనపై సహజంగా అసంతృప్తి ఉంటుంది. సొంత పార్టీలోనే కొంత వ్యతిరేకత కనపడుతుంది. అయితే అక్కడ కాంగ్రెస్ తెలివిగా ఈసారి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను బరిలోకి దించింది. అజార్ భాయ్ కు ఉన్న పరిచయాలతో పాటు ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎక్కడ పడతాయోనని భావించి ఎంఐఎం రంగంలోకి దిగింది. 2018లో పోటీ చేయని ఎంఐఎం ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తుందన్న ప్రశ్నకు టార్గెట్ కాంగ్రెస్ అనేది ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
ఎంఐఎం ఖరారు చేసిన స్థానాలు

1. చార్మినార్ - జుల్ఫేఖర్ అహ్మద్
2. చాంద్రాయణ గుట్ట - అక్బరుద్దీన్ ఓవైసీ
3. మలక్ పేట్ - అహ్మద్ బలాల
4. నాంపల్లి - మాజిద్ హుస్సేన్
5. కార్వాన్ - కౌజర్ మోహినుద్దిన్
6. యాకుత్పుర - జాఫర్ హుస్సేన్ మీరజ్
7.బహదూర్ పుర - జనాబ్ మోజం ఖాన్
రాజేంద్రనగర్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.


Tags:    

Similar News