Telangana Election : తెలంగాణలోనే అతి ఖరీదైన నియోజకవర్గం ఇదేనట... ఓటుకు ఎంతంటే?

హైదరాబాద్ నగరంలో అతి పెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. తెలంగాణ ఎన్నికల్లో అతి ఖరీదైన ఎన్నిక ఇక్కడ జరుగుతుంది

Update: 2023-11-05 12:34 GMT

హైదరాబాద్ నగరంలో అతి పెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోనే అతి ఖరీదైన ఎన్నికగా దీన్ని భావిస్తున్నారు. నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండటం, ఓటర్ల సంఖ్య కూడా అధికంగా ఉండటం ఒక కారణమయితే... పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ కోటీశ్వరులే. అందుకే ఇక్కడ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులు డబ్బులు వెదజల్లుతారు. ఇక్కడ ఓటుకు ఎంత పలుకుతుందో అంతలో సగమే మిగిలిన నియోజకవర్గాల్లో ఉంటుందని రాజకీయ పండితులు సయితం అంగీకరిస్తున్న విషయం. ఎవరూ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రచారం నుంచి అన్ని రకాలుగా ఇక్కడ ఖరీదుగానే కనిపిస్తుంది. తెలంగాణలో అన్నింటికంటే ఫలితం చివర వచ్చేది కూడా ఈ నియోజకవర్గమే. ఎందుకంటే అన్ని ఈవీఎంలను లెక్కించాల్సి ఉంటుంది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి...
మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పోటీ చేస్తున్నారు. ఆయన మొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తొలి విడతలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన పేరును ప్రకటించారు. అయితే తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఆయన పార్టీని వదిలేసి వచ్చారు. కాంగ్రెస్ తో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. అనుకున్నట్లే ఆయన కుటుంబానికి కాంగ్రెస్ రెండు స్థానాలు ఇచ్చింది. ఒకటి మల్కాజ్ గిరిలో తనకు, రెండోది మెదక్ లో తన కుమారుడు రోహిత్ కి సీటును ఖరారు చేసింది.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
మైనంపల్లి హన్మంతరావు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా మరోసారి తాను గెలవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన డబ్బును ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా తక్కువేమీ కాదు. ఆయన మంత్రి మల్లారెడ్డి అల్లుడు. వందల కోట్ల సంపదకు అధిపతి. ఈ ఎన్నికలో గెలవాలని కేసీఆర్ మల్లారెడ్డికి టార్గెట్ గా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా అన్ని రకాలుగా డబ్బులు ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. మంత్రి మల్లారెడ్డి కూడా మల్కాజ్ గిరిని ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. మైనంపల్లిని ఓడించగలిగితేనే మరోసారి తనకు కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ లభిస్తుందన్న సమాచారంతో ఆయన అల్లుడి కోసం ఎంత డబ్బును వెదజల్లడానికైనా రెడీ అంటున్నారు. ఒకసారి మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి వెళితే రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల ఫ్లెక్సీలు, ప్రచారాన్ని చూస్తేనే వారు ఎంత సొమ్మును ఖర్చు చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది.
అతి పెద్ద నియోజకవర్గంతో పాటు...
మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో మల్కాజ్‌గిరి, సఫి‌ల్‌గూడ, మౌలాలి, వినాయక్ నగర్, కాకతీయ నగర్, తూర్పు ఆనందబాగ్, గౌతమ్ నగర్, నేరేడ్‌మెట్, సైనిక్ పురి, ఆల్వాల్, యాప్రాల్, మచ్చ బొల్లారం వంటి ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతల్లో పేదలు అధికంగా నివసిస్తుంటారు. వీరి ఓట్లను కొనుగోలు చేయడానికి రెండు పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారన్న ప్రచారం జరుగుతుంది. ఇంటిలో ఐదు ఓట్లు ఉంటే చాలు పాతికవేలుతో పాటు వారు కోరిన ఫ్రిడ్జ్ లేదా కలర్ టీవీ వంటి వాటిని కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందులో నిజానిజాలు ఎంత ఉన్నప్పటికీ తెలంగాణలోనే అతి ఖరీదైన ఎన్నిక మల్కాజ్ గిరి అని చెప్పక తప్పదు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. మరి చివరకు ఎవరిది గెలుపు అనేది చివర వరకూ చెప్పలేమంటున్నారు.
Tags:    

Similar News