ఫ్లాష్ సర్వే రిజల్ట్.. ఇద్దరికీ సీట్ల మార్పు.. రీజన్ ఇదే
కాంగ్రెస్ టిక్కెట్ల జాబితాను రెడీ చేసి త్వరలోనే విడుదల చేయనుంది. బీఆర్ఎస్ కు పోటీగా అభ్యర్థులను రంగంలోకి దించుతుంది
కాంగ్రెస్ టిక్కెట్ల జాబితాను రెడీ చేసింది. త్వరలోనే విడుదల చేయనుంది. బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీగా అభ్యర్థులను రంగంలోకి దించుతుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనుంది. ఇప్పటికే 70 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసింది. హైకమాండ్ అనుమతి వచ్చిన వెంటనే దానిని విడుదల చేయనుంది. ఖమ్మం జిల్లాలో పార్టీలో కొత్తగా చేరిన ఇద్దరు నేతలకు మాత్రం కాంగ్రెస్ వారి ఇష్ట ప్రకారం టిక్కెట్లు కేటాయించలేదు. గెలిచే చోట, వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వారికి టిక్కెట్‌ను ఖరారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇద్దరికీ వేర్వేరు...
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రముఖ నేతలుగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం టిక్కెట్ ను ఆశిస్తున్నారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టిక్కెట్ కేటాయించకపోవడం వల్లనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అయితే వీరిద్దరి కోరికలను పార్టీ హైకమాండ్ మన్నించలేదు. తమ సర్వేల ప్రకారమే టిక్కెట్లను కేటాయించినట్లు తెలిసింది. ఎవరికి ఎక్కడ పట్టుంది? ఎక్కడైతే వీరు గెలుస్తారు? అన్న ప్రాతిపదికగా మాత్రమే టిక్కెట్లు కేటాయింపు జరిగిందని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది.
గెలుపు ఖాయమనే...
ఫ్లాష్ సర్వేలు కూడా కాంగ్రెస్ చేయిస్తుంది. వారానికి ఒక సర్వే జరిపి మరీ టిక్కెట్లు కేటాయిస్తుందని తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటును కేటాయించినట్లు తెలిసింది. ఖమ్మం అయితే కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. తుమ్మల అంటే అభిమానించే వారు ఎక్కువగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కమ్మ సామాజికవర్గం వారే. దీంతో ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును పోటీ చేయించాలన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చింది. ఖమ్మం నుంచి అయితే తుమ్మల నాగేశ్వరరావు గెలుపు ఖాయమని సర్వేలు కూడా తెలిపాయని అంటున్నారు.
అక్కడయితేనే...
ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరుకుంటున్నట్లుగా ఆయనకు కొత్తగూడెం టిక్కెట్‌కు నో చెప్పింది. ఆయనను పాలేరుకు షిఫ్ట్ చేసినట్లు తెలిసింది. పాలేరులో రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండటం, అక్కడ ఒకవేళ షర్మిల పోటీ చేసినా పోటీని పొంగులేటి అయితేనే తట్టుకోగలరన్న నమ్మకంతో ఆయనకు ఆ సీటును ఖరారు చేసింది. పాలేరులో పొంగులేటి సామాజికవర్గమే కాకుండా ఆయన బంధువర్గం కూడా ఎక్కువగా ఉండటంతో అన్నీ అంచనాలు వేసి మరీ టిక్కెట్లు కేటాయించిందని చెబుతున్నారు. ఈసారి కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గెలుపే లక్ష్యంగా టిక్కెట్లు కేటాయింపు జరుపుతుందని చెప్పడానికి ఈ రెండు టిక్కెట్లు ఒక ఉదాహరణ మాత్రమే.