Pawan Kalyan : అలాంటప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారో.. ఏమో?

జనసేన పార్టీది రూట్ అర్థం కాకుండా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

Update: 2023-11-13 06:36 GMT

జనసేన పార్టీది రూట్ అర్థం కాకుండా ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ తెలంగాణలో ప్రచారం చేయలేదు. ఒక్క మోదీ పాల్గొన్న బీసీ సదస్సులో పాల్గొనడం మినహా తమ అభ్యర్థుల ప్రచారానికి ఆయన పూనుకోకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు పవన్ కల్యాణ్ కు తెలంగాణలో పోటీ చేయడం ఇష్టమా? లేదా? కేవలం బలవంతంపైనే పోటీకి అంగీకరించారా? అన్న కామెంట్స్ కూడా పార్టీ నేతల నుంచే వినపడుతున్నాయి. అందుకు కారణాలు కూడా అనేకం కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉండి కూడా ఎందుకు ఆయన ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.

ప్రచారానికి దూరంగా...
జనసేన, బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో అధికారికంగా పొత్తు కుదిరింది. సీట్ల ఒప్పందం కూడా ఖరారయింది. బీజేపీ జనసేనకు ఎనిమిది సీట్లను కేటాయించింది. కనీసం ఎనిమిది స్థానాల్లోనైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలన్న తపన, పట్టుదల నాయకత్వానికి ఉండి తీరాలి. కానీ అవేమీ నాయకత్వంలో కనిపించడం లేదు. మోదీ సభలోనూ ఆయనను ప్రశంసించడానికే పవన్ కల్యాణ్ ఎక్కువ సమయం కేటాయించారు తప్పించి కనీసం కేసీఆర్ ను విమర్శించే సాహసం చేయకపోవడం విశేషం. మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు కానీ, కేసీఆర్ పై పదునైన మాటలతో విరుచుకుపడలేదు. అప్పడే జనసేన క్యాడర్ కు డౌట్ వచ్చింది.
తమ అభ్యర్థుల కోసమే అయినా...
కానీ కనీసం తమ పార్టీ అభ్యర్థులకైనా ప్రచారం చేస్తారని భావించారు. తొలిసారి తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన తలపడుతుంది. అది గమనించైనా ఒక్క స్థానంలోనైనా గెలిచి తెలంగాణ శాసనసభలో జనసేన జెండా కనిపించేలా చూడాలని కోరిక కూడా లేనట్లుంది. ఇక ఎన్నికలకు పదిహేడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 28వ తేదీతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. అంటే ఖచ్చితంగా పదిహేను రోజులు మాత్రమే. ఈ పదిహేను రోజుల్లో నైనా ఎక్కడైనా తన అభ్యర్థుల కోసం పవన్ వస్తారా? అన్నది పార్టీలోనే చర్చ జరుగుతుండటం విచారకరమే. ఎందుకంటే లీడర్ ముందుండి నడిపించాల్సి ఉండగా వెనకుండి ప్రత్యర్థులకు సహకరిస్తున్నట్లుగా తయారైంది జనసేన పార్టీ నాయకత్వానిది.
కేసీఆర్ పై...
పవన్ కల్యాణ్ ఏనాడు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. చేయకపోగా అప్పుడప్పుడు వీలయినప్పుడల్లా ప్రశంసలు కురిపించారే తప్ప ఆరోపణలకు కూడా దిగలేదు. ఫిలిం ఇండ్రస్ట్రీలో తాను భాగస్వామి కారణం కావచ్చు. కేసీఆర్ పాలన ఆయనకు నచ్చి ఉండవచ్చు. ఇవే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయంటే పవన్ వ్యవహారశైలి ఇందుకు కారణమని చెప్పకతప్పదు. జనసేన అభ్యర్థుల ప్రచారానికి హాజరైతే కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేయాల్సి ఉంటుందనే దూరంగా ఉంటున్నారా? అన్న సందేహం కూడా సహజంగా తలెత్తుతుంది. మరి ఈ అనుమానాలన్నింటికీ పవన్ తెరదించుతారా? లేక ఇక్కడ పార్టీని వదిలేసి ఏపీపై ఫోకస్ పెడతారా? అన్నది చూడాలి.
Tags:    

Similar News