Telangana Elections : మళ్లీ ఉప ఎన్నికలా? ఈ గోలేంది బాబయ్యా?

తెలంగాణ ఎన్నికలు ముగిసాయని అనుకోవడానికి వీలులేదు. మళ్లీ ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిందే

Update: 2023-11-12 07:01 GMT

తెలంగాణ ఎన్నికలు ముగిసాయని అనుకోవడానికి వీలులేదు. మళ్లీ ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిందే. ఒకటా? రెండా? మూడా? అన్నది ఎన్నికల ఫలితాల తర్వాత వెలువడనుంది. ఇందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. నవంబరు 30వ తేదీన పోలింగ్ కాకముందే మళ్లీ ఉప ఎన్నికల ప్రస్తావన ఎందుకు వచ్చిందని కదా? మీ డౌట్. అక్కడకే వస్తున్నాం. ముగ్గురు నేతలు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎక్కడ ఏమాత్రం తేడా జరిగినా ఒకరు రెండు చోట్ల గెలిచినా ఉప ఎన్నిక జరగడం ఖాయం. అందుకే ఈసారి తెలంగాణ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లో ఏదో ఒక చోట కానీ, రెండుచోట్ల కానీ ఉప ఎన్నికలు తప్పవని చెప్పక తప్పదు.

ఏది వదులుకుంటారు?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. తాను రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ లోనూ తను పుట్టిన జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గంలోనూ బరిలోకి దిగారు. రెండుచోట్ల కేసీఆర్ నామినేషన్ వేశారు. ఇందులో రెండు చోట్ల కేసీఆర్ గెలిచారనుకుందాం. ఒకచోట ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. అది కామారెడ్డా? గజ్వేల్? అన్నది ఆయన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్క నియోజకవర్గమైనా వదులుకుంటే తిరిగి అక్కడ ఉప ఎన్నిక తప్పదు. అయితే ఆయన తనకు రెండు సార్లు అండగా నిలిచిన గజ్వేల్ నియోజకవర్గాన్ని ఉంచుకుంటారా? ఉప ఎన్నికల్లో ఇబ్బంది పెడుతుందని భావిస్తే కామారెడ్డిని ఉంచుకుని గజ్వేల్ ను వదులుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.
రేవంత్ వంతు....
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అంతే. ఆయన తన సొంత నియోజకవర్గమై కొడంగల్ నుంచి బరిలోకి దిగారు. అలాగే కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలోనూ నామినేషన్ వేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డి రెండు చోట్ల గెలిస్తే ఒక నియోజకవర్గాన్ని వదులుకోక తప్పదు. ఆయన తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నే ఉంచుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొడంగల్ ను ఉంచుకుని కామారెడ్డిని వదులుకునే అవకాశాలున్నాయి. అలాగే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కామారెడ్డిని ఉంచుకుని కొడంగల్ ను విడిచిపెట్టే అవకాశాలున్నాయని పార్టీ నేతలే చెబుతున్నారు. రెండు చోట్ల గెలిస్తేనే ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒకచోట గెలిచి, ఒకచోట ఓటమి పాలయితే ఉప ఎన్నిక ప్రశ్న ఉత్పన్నం కాదు.
ఈటల పరిస్థితి...
బీజేపీ నేత ఈటల రాజేందర్ పరిస్థితి కూడా అంతే. ఆయన తాను ఎనిమిది సార్లు విజయం సాధించిన హుజురాబాద్ లో పోటీ చేస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి కూడా బరిలోకి దిగారు. అంటే రెండు చోట్ల గెలిస్తే ఏదో ఒకదానిని వదులుకోవాల్సినప్పుడు ఆయన గజ్వేల్ ను ఉంచుకుని హుజూరాబాద్ ను వదులుకుంటారా? లేక హుజూరాబాద్ నే ఉంచుకుని గజ్వేల్ ను ఉంచుకుంటారా? అన్నది ఆయన ఇష్టాయిష్టాలను బట్టే ఉంటుంది. రెండు చోట్ల గెలిస్తే ఉప ఎన్నిక రావడం ఖాయం. అయితే ముగ్గురు నేతలు రెండు చోట్ల పోటీచేస్తుండటంతో ఉప ఎన్నిక ఒకటయినా ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ రెండు చోట్ల పోటీకి దిగినప్పుడు ఎక్కడో ఒకచోట గెలిపిస్తారులే అన్న ధోరణితో ప్రజలు రెండు చోట్ల వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం? చెప్పలేని పరిస్థితి.
Tags:    

Similar News