KCR : ఆ పేరు ఇప్పుడెందుకబ్బా... కేసీఆర్ మామూలోడు కాదుగా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్ సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరు ప్రకటించడం చర్చనీయాంశమైంది

Update: 2023-11-02 04:41 GMT

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఒకపక్క రాజశ్యామల యాగం చేస్తూనే మరొకవైపు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నిన్న సత్తుపల్లిలో జరిగిన సభలో అకస్మాత్తుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు పేరును ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయం కోసమే నామా నాగేశ్వరరావు పేరున ఈ ఎన్నికల్లో ప్రకటించారని అనుకోవాల్సి ఉంటుంది. నామా నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి లోక్ సభలో అడుగు పెడతారన్న కేసీఆర్ ప్రకటనపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికలు లేకున్నా...
ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు లేవు. కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే ఖమ్మం లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించడం వెనక రాజకీయ కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కొంత బలహీనంగా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కమ్మ సామాజికవర్గం నేతలే కాకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లు, సానుభూతి పరులు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు.
ఆ సామాజికవర్గం...
ప్రధానంగా కమ్మ సామాజికవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు తర్వాత నామా నాగేశ్వరరావుకు కొంత ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ఓట్లు బీఆర్ఎస్ కు కాకుండా కాంగ్రెస్ కు బదిలీ అవుతాయని కేసీఆర్ అంచనా వేసుకుంటున్నారు. సర్వేలు కూడా అవే చెబుతున్నాయి. గత ఎన్నికల ఫలితాలు కూడా బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో సానుకూలంగా రాలేదు. దీంతో నామా నాగేశ్వరరావును లోక్ సభ అభ్యర్థిగా ముందుగా ప్రకటిస్తే కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆయన భావించారు. అందుకే సమయం కాకపోయినా ఇప్పుడు నామా నాగేశ్వరరావు మరొకసారి ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారంటున్నారు.
బేస్ లేకపోవడంతో...
ఖమ్మం జిల్లాలో ఎప్పుడూ బీఆర్ఎస్ కు బేస్ లేదు. ఉన్న నేతలు పార్టీని వీడటంతో ఇంకొంత ఆందోళన కలుగుతుంది. వరదల సమయంలో భద్రాచలం వాసులతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ కు అంత అనుకూలత లేదు. అందుకే గిరిజనులకు పోడు భూములను పంచారు. అన్ని రకాలుగా ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ కావడంతో టీడీపీ ప్రభావం కొంత చూపుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కూడా ఈ ఎన్నికల్లో ఇక్కడ కీలకంగా మారనున్న నేపథ్యంలోనే నామా నాగేశ్వరరావు పేరును ఇప్పడు కేసీఆర్ ప్రకటించారన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. మరి కేసీఆర్ చేసిన ఈ ప్రకటన పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News