మరోసారి ఆశీర్వదించండి... తొలి ప్రచారం ప్రారంభం

ఓటు అనేది తలరాతను మారుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ లో తొలి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు

Update: 2023-10-15 11:56 GMT

ఓటు అనేది తలరాతను మారుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ లో తొలి ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఎవరో చెప్పారంటూ ఓటు వేయవద్దని కోరారు. ఖచ్చితంగా ఆలోచించి స్పష్టమైన విధానంతో ఓటు వేయాలన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో నేను చెప్పాల్సిన పనిలేదన్నారు. అన్నీ ఆగమాగంగా ఉండేవన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద బాధ్యతను ప్రజలు పెట్టారు కాబట్టి నిపుణులతో చర్చించి మరీ మేధోమధనం చేసి మరీ అభివృద్ధి వైపు పయనించామన్నారు. ఎటూ చూసినా కటిక చీకటిలో ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. పథ్నాలుగేళ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఈనాడు దేశంలో అన్ని రంగాల్లో నెంబరు వన్ గా చేసుకున్నామన్నారు.

ఆ పార్టీలన్నింటినీ...
కొన్ని పార్టీలు ఈరోజు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని, కొన్ని దశాబ్దాలు పాటు ఛాన్స్ ఇచ్చినా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పది నుంచి పన్నెండు ఛాన్స్‌లు ఇచ్చినా వారు చేసిందేమీ లేదని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. రాయి ఏంటో రత్నమేదో గుర్తించి ఓటు వేయాలని కోరారు. హుస్సాబాద్ ప్రజల ఆశీర్వదంతోనే 2018లో 88 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. పింఛను పథకాన్ని ఐదు వేలకు పెంచుతున్నామని తెలిపారు. రైతు బంధు సాయాన్ని కూడా మరింత పెంచుతున్నామని తెలిపారు. మూడు పంటలను పండించుకునే స్థితికి చేరుకున్నామని తెలిపారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామని తెలిపారు.
దేశంలో ఎవరూ...
దేశంలో మనకు ఎవరూ సాటి లేరన్నారు. బిందె పట్టుకుని ఆడబిడ్డ రోడ్డు మీద కనపడితే ఆ రోజు ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పానన్నారు. ఇప్పడు తాగునీటి సమస్య లేదన్నారు. ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, కళ్లముందే ఉన్నాయన్నారు. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని, మీరే సాక్షులని కేసీఆర్ అన్నారు. మరో ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని అన్న ఆయన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పటిష్టమైన ఆర్థికంగా ముందంజలో ఉండే మనం దేశానికి మార్గదర్శకంగా ఉండాలని, అందుకే బీఆర్ఎస్ మళ్లీ గెలవాలని ఆయన పిలుపు నిచ్చారు.
సభలోనే బీ ఫారం...
సతీష్ అందరినీ కలుపుకుని పోతారని, హుస్నాబాద్ లో ఆయనను మరోసారి గెలిపించుకోవాలని కోరారు. పెద్ద మెజారిటీతో సతీష్ గెలిపించుకోవాలని కోరారు. హుస్నాబాద్ నుంచి గెలుపే 115 సీట్లు దిశగా బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ ది పేదలది ప్రభుత్వమని, మీ ఆశీర్వాదం కోసమే వచ్చానని అన్నారు. సతీష్ కుమార్ కు హుస్నాబాద్‌లోనే బీ ఫారం బహిరంగ సభలో అందచేశారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు.



Tags:    

Similar News