KCR : వాళ్లు గొడ్డలి భుజం మీద పెట్టుకుని రెడీ గా ఉన్నారు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు

Update: 2023-11-07 12:02 GMT

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ కష్టాలు మొదలవుతాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు రాగానే అందరూ ఆగమాగం అవుతారని అలా కావద్దని అన్నారు. ఎన్నికల్లో ఓటు ఆషామాషీగా వేయవద్దని కోరారు. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వజ్రాయుధం మీ ఓటు అని అన్నారు. మీ ఓటు దేశ భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. గ్రామాల్లో చర్చ చేసి నిజానిజాలు నిగ్గుతేల్చి ఓటు వేయండని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీకి ఒకరు నిలబడతారని, బీఆర్ఎస్ తరుపున మనోహర్ రెడ్డి ఉన్నారన్నారు. ఏ పార్టీ చరిత్ర ఏంది? వాళ్ల నడవడిక ఏందన్నది ప్రజలు ఆలోచించడమే ప్రజాస్వామ్య పరిణితి అని కేసీఆర్ అన్నారు. ఎవరో చెప్పారని ఓటేస్తే భవిష్యత్ ను ఖరాబు చేసినట్లవుతుందన్నారు.

పదేళ్ల నుంచి ...
నాయకులు గెలవడం కాదని, ఎన్నికల్లో ప్రజలు గెలవాలని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమని అన్నారు. ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోగలిగామన్నారు. 1956 దాకా తెలంగాణ ఉండేదని, తర్వాత ఇష్టం లేకుండా కలిపారని ఆయన అన్నారు. పెద్దపల్లిలో మంచినీళ్ల కోసం అందరూ ఏడ్చామని అన్నారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ ప్రజల బాధను ఎన్నడూ చూడలేదన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదన్నారు. వందేళ్లలో ఈ పదేళ్లలోనే ప్రశాంతంగా ఉందని, కరువు లేదు.. కాటకాలు లేవన్నారు. దయచేసి ఆలోచించాలని ఆయన కోరారు. పార్టీల వైఖరి చాలా ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయకట్టు రైతులకు కూడా నీళ్లు రాలేదని, అయితే వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, గ్రామాలు చల్లగా ఉండాలని అన్నారు.
కాంగ్రెస్ వస్తే...
కరెంటు మూడు గంటలు ఇస్తే పొలం పారతదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలు మాత్రమే కరెంట్ వస్తుందన్నారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారన్నారు. గొడ్డలి భుజం మీద పెట్టుకుని రెడీగా ఉన్నారని, కానీ ధరణిని తొలగిస్తే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయి అని ఆయన ప్రశ్నించారు. మళ్లీ వ్యవహారం మొదటికి వస్తుందన్నారు. ఇవన్నీ ఆలోచించాలని ఆయన కోరారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఆ పార్టీ వస్తే ఇక ఏమీ రావన్నారు. దరఖాస్తు లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అందుతున్నాయని తెలిపారు. గ్రామాల్లో చర్చించి చివరకు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
Tags:    

Similar News