KCR : మళ్లీ విక్టరీ రావుగారి..దేనట... అదే కారు పార్టీ నేతల ధీమా

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాలను తన వైపునకు తిప్పుకోవడంలో దిట్ట.

Update: 2023-11-08 07:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాలను తన వైపునకు తిప్పుకోవడంలో దిట్ట. ఆయనకు మించిన నేత మరొకరు ఉండరు. తెలంగాణ సెంటిమెంట్ అయినా..ప్రత్యర్థులతో పొత్తులపై కాని ఆయన పల్లెత్తు మాట్లాడకుండానే ప్రజలను తమ వైపునకు తిప్పుకునే సామర్థ్యం ఉన్న నేత. అందుకే తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. కొన్ని అంశాలు కూడా ఆయనకు అలాగే కలసి వస్తున్నాయనుకోవాలో... తెలియదు కానీ విక్టరీ అంటే రావుగారిదేనని పోలింగ్ కు ముందుగానే అందరూ ఫిక్స్ అయ్యేలా చేస్తారు. ప్రత్యర్థుల్లో ఎన్నికలకు ముందుగానే చీలిక తెచ్చి తనపై ఉన్న వ్యతిరేక ఓటును చీల్చగలిగిన అసమాన్యుడు కేసీఆర్. ఆయన మైండ్ లో ఆలోచనలన్నీ అధికారంలోకి ఎలా రావాలన్న ఆలోచనలతో పాటు ప్రత్యర్థులను ఎలా బలహీనం చేయాలన్నది కూడా నిరంతరం వస్తూనే ఉంటాయి.

ప్రజల్లోకి వెళ్లేది...
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రజల్లో తిరిగేది చాలా తక్కువే. ఆయన ప్రజలను కలవరు. ఎమ్మెల్యేలను కాదు కదా మంత్రులు కూడా ఆయనను కలుసుకోవాలంటే గగనమే. అలాంటి కేసీఆర్ ఎన్నికలు వచ్చాయంటే చాలు జనంలోకి వచ్చి వాలిపోతారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ తాను ఇచ్చేది ఏమిచ్చేది చెబుతూనే ప్రత్యర్థులు వస్తే తెలంగాణ ఆగం అవుతుందని కూడా పరోక్షంగా బెదిరింపులకు కూడా దిగుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలన్నీ ఆగిపోతాయని బెదరగొట్టడంలో కేసీఆర్‌కు మించిన లీడర్ మరొకరు లేరనే చెప్పాలి. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి తాను మళ్లీ అధికారంలోకి రాగానే ఇక్కడకు వచ్చి కూర్చుని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి మరీ వెళ్లిపోవడం ఆయన నోట వెంట వచ్చే మాట. తన మ్యానిఫేస్టోను గురించి తక్కువ చెప్పి ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో దిట్ట.
కనెక్ట్ కావడంలో...
ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తనకు ప్రధాన శత్రువని అంచనా వేసుకున్నారు. ఆయన జరిపిన సర్వేల్లో కూడా అదే తేలింది. దీంతో కాంగ్రెస్ ను బలహీనం చేయడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాను తెలంగాణ కోసమే పుట్టానని, తాను అధికారంలోకి రాకపోతే తెలంగాణ దేశం ముందు నవ్వుల పాలవుతుందని నమ్మబలుకుతారు. జనానికి కనెక్ట్ కావడంలో ఆయనకు ఆయనే సాటి. సొంత మనిషిలా ఎన్నికల సమయంలో మారిపోతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం అవుతారన్నది వేరే విషయం. ఎన్నికలప్పుడు మాత్రం కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయి జనంలో కలసి పోయే ప్రయత్నం చేస్తారు. ఆయన మాటల గారడీ అలాంటిది. ఆయన చేతలు కూడా అలాంటివే.
ఎన్నికలప్పుడు సెంటిమెంట్...
జనాలను తన ప్రసంగంతో కారుకు కట్టుకుని తన వెంట తీసుకుని పోయేలా ఆయన వైఖరి ఉంటుంది. తెలంగాణ ఎన్నికలు వచ్చినప్పుడు ఏపీ సెంటిమెంట్ ను బయటకు తీస్తారు. అంతకు ముందు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి ఏపీలోనూ పార్టీ శాఖను ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ బాధలను ప్రస్తావిస్తూ ప్రజలను నాటి రోజుల్లోకి వెళ్లేలా రీల్స్ ను రివైండ్ చేయగలరు. మళ్లీ అదే సెంటిమెంట్ తో గెలిచే సత్తా ఆయనకుందని పార్టీ నేతలు కూడా విశ్వసిస్తుంటారు. అందుకే కారు పార్టీలో జోరు తగ్గలేదు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం గులాబీ పార్టీలో అందరికీ ఉండటం ఎంత సహజమో తెలంగాణలోని ఎక్కువ భాగం సమాజంలో అదే అభిప్రాయం ఉందన్నది కూడా వాస్తవం. మరి ఈసారి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Tags:    

Similar News