BJP : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఇలాగేనా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని చెబుతుంది

Update: 2023-11-24 04:12 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు గడువు సమీపిస్తున్న కొద్దీ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు పలు రకాలుగా ఉన్నాయి. ఒక్కో పార్టీదీ ఒక్కో అంచనా. ఆత్మవిశ్వాసం కావచ్చు. తమను ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందని నమ్మకం కావచ్చు. ఈసారి అధికారం తమదేనని ప్రతి పార్టీ అంటోంది. భారతీయ జనతా పార్టీ తాము అధికారంలోకి రావడం ఖాయమని చెబుతుంది. ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి నేతల వరకూ ఈసారి తెలంగాణలో అధికారం తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత సీనుందా? తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలముందా? లేక క్యాడర్ లో ధైర్యం చెప్పే ప్రయత్నమా? అన్నది ఈ కథనం ద్వారా తెలుసుకోండి.

జాతీయ పార్టీగా...
బీజేపీ జాతీయ పార్టీగా దక్షిణాదిన కొంత ఇబ్బందులు పడుతుంది. ఆ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు లేదు. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో కమలం పార్టీ రాణించలేకపోతుంది. ఒక్క కర్ణాటక మినహా మరెక్కడా కాలు మోపడానికి కూడా ఇబ్బందులు పడుతుంది. అలాంటిది గత కొన్నాళ్లుగా తెలంగాణలో బలంగా కనిపిస్తుంది. అనేక చర్యల ద్వారా తెలంగాణలో పార్టీకి భవిష్యత్ ఉందన్న నమ్మకాన్ని కలిగించే విధంగా వాతావరణం ఉంది. దీంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో పాటు డబుల్ ఇంజిన్ సర్కార్ వంటి నినాదాలతో ఇక్కడ నిలదొక్కుకోగలిగింది. రాష్ట్ర నాయకత్వం కంటే ఢిల్లీ నాయకత్వాన్ని చూసే ఇక్కడ ఓటు బ్యాంకు అంతో ఇంతో పెరిగిందని చెప్పాలి.
గతంలో కంటే...
తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం కొంత సానుకూల అంశంగానే చూడాలి. అలాగే అత్యధిక శాతం ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ హామీ ఇచ్చి వారిని తమ వైపునకు తిప్పుకోగలిగారు. దీంతో పాటు నగరాల్లో బీజేపీ కొంత బలం పుంజుకుందనే చెప్పాలి. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నియోజకవర్గాలు.. ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు సంపాదించుకోగలిగింది. దీంతో గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బీజేపీ ఈసారి పవర్ లోకి రావడం ‍ఖాయమని భావిస్తుంది. బీజేపీ అనుకూల, ప్రతికూలతలను ఒకసారి పరిశీలిస్తే...

బలాలు :

బీసీ ముఖ్యమంత్రి ప్రకటన
బీసీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్‌ లాంటి వారు ఉండటం
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు
నరేంద్ర మోదీ ఇమేజ్
అర్బన్ లో యువత పార్టీకి అనుకూలంగా ఉండటం
హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో బలాన్ని పెంచుకోవడం
మోదీ, అమిత్ షాలతో పాటు అగ్రనేతల ప్రచారం

బలహీనతలు :

రాష్ట్ర నాయకత్వం బలహీనంగా ఉండటం
బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం
జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం
వరసగా నేతలు పార్టీని వీడటం
క్షేత్రస్థాయిలో బలంగా లేకపోవడం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకపోవడం
బీఆర్ఎస్ తో పరోక్ష పొత్తు ఉందన్న ప్రచారం


Tags:    

Similar News