Srirama Navami : శ్రీరాముడు చాటి చెప్పిందేమిటి? ఆయన చూపిన మార్గామేమిటో తెలుసా?
భారతదేశానికి సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని ఉదాహరణగా చూపుతారు
భారతదేశానికి సనాతమైన పరిపాలనకు మార్గదర్శిగా శ్రీరాముడిని ఉదాహరణగా చూపుతారు. ఆధునిక జీవన సూత్రాలు, రాజధర్మమూ ముడిపడి ఉండటం ఆయన పాలనలోని విశేషం. వేల సంవత్సరాల క్రితం పురాణేతి హాసాల్లో నిక్షిప్తమైన రామచరిత్ర నేటికీ ఆదర్శంగా నిలుస్తోందంటే అందులోని గొప్పతనం అర్థమవుతుంది. రామచంద్రుడు చూపిన బాటను అనుసరించడం నేటి పాలకులకు అవసరం. రాముడు పరిపాలన, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఆశ్రిత వాత్సల్యం వంటి విషయాల్లో ఒక ప్రమాణం. అందుకే రాముడు నేటికీ ఆదర్శప్రాయమవుతున్నాడు.
రాజధర్మం…కులాలు.. మతాలు...
రాజ్యంలో ఉండే ప్రజలందరూ పాలకుని దృష్టిలో సమానులే. అర్హతను బట్టి అవకాశాలు కల్పించడమనేది పాలకుల ధర్మం. చెడ్డవాడు ఎంతటి బలవంతుడైనా అతనిని పదవి నుంచి తొలగించి మంచివాడికి మార్గం కల్పించాలి. వాలి మహాబలవంతుడు. అయినా చెడుమార్గం పట్టాడు. అతనిని తొలగించి సుగ్రీవునికి పట్టం గట్టాడు రాముడు. రాజధర్మం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమూ, చట్టాలు చేయడమే కాదు. ప్రజలను పీడిస్తున్న వ్యవస్థను ప్రక్షాళన చేయడము కూడా. కులాలు, మతాల పేరిట సమాజం విచ్ఛిన్నమవుతోంది. బలవంతపు చర్యలతో ఆధిపత్య ధోరణులు నెలకొంటున్నాయి. తన జాతి కాకపోయినప్పటికీ పశుపక్ష్యాదులతోనూ చెలిమి చేసిన ఘనత రామునికి దక్కుతుంది. ఆటవికులను అక్కున చేర్చుకున్నాడు. వానరులతో చేయి కలిపాడు. పక్షి చనిపోతేనే ప్రాణప్రదంగా బావించి వలవల ఏడ్చాడు. మతమూ, కులమూ కాదు, మానవత ముఖ్యమనేది శ్రీరామ సందేశం. అందుకే ప్రకృతిలోని సమస్త జీవులకు సమ స్థానం కల్పించాడు రాముడు.
క్రమశిక్షణ…విలువలతో కూడిన...
విద్యార్థి లోకానికి కూడా రాముడు స్పూర్దిదాయకుడు. తాను రాజకుమారుడు. అయినా శిష్యుల్లో ఒకడే. వశిష్టుడు, విశ్వామిత్రుడి పట్ల శ్రీరాముడు కనబరిచిన గురుభావం నేటి తరంలో మచ్చుకైనా కనిపించడం లేదు.సీతాదేవి శ్రీరాముడిని తొలి చూపులోనే ఇష్టపడినా తన అర్హత ద్వారానే స్వయంవరంలో పరిణయం చేసుకున్నాడు రాముడు. అది జీవనాదర్శం. రాముడు అన్నిటా ఆదర్శమే. అన్నివర్గాలకూ పూజనీయుడే. శ్రీరామ నవమిని ఒక పండుగలా కాకుండా, ఆయన ఆశయాలు, ఆదర్శాలనూ స్మరించుకోవడమూ అవసరమే. అందుకే శ్రీరామ నవమిని ఒక పండగలా భావించకుండా ఆయన చూపిన ఆదర్శాలను నేటి సమాజం పరిగణనలోకి తీసుకుంటే సమస్యలు ఏవీ ఉండవు.