భాజపాకు కాలం కలసి వస్తోంది!

Update: 2016-10-23 00:37 GMT

కలిసొచ్చే కాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత! దాన్ని ఆధునిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాస్త సవరించుకోవాలేమో. కలిసొచ్చే కాలమొస్తే అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలో ముసలం పుడుతుంది. అవును మరి.. యూపీ పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి. ఈసారి అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కించుకుని మోదీ పాలనకు దానిని కానుకగా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో అక్కడ అధికారంలో ఉన్న పార్ట సమాజ్ వాదీ అంతర్గత కలహాలతో బజార్న పడడం గమనిస్తే.. భాజపాకు అదృష్టం పట్టినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం అఖిలేష్ సీఎంగా అధికారంలో ఉన్న ఎస్‌పి పార్టీ కొట్టుకోవడం ఒకటే తక్కువ .. తతిమ్మా అన్ని రకాలుగానూ కలహాల విషయంలో ముందంజలో ఉంది. అన్ని రకాలుగానూ అఖిలేష్ కొత్త పార్టీ పెట్టుకుని.. బయటకు వెళ్లడానికి అనుకూలంగానే యూపీ రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. అఖిలేష్ కు సన్నిహితులైన వారిని , రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ సస్పెండ్ చేయడం, తాజాగా అఖిలేష్ ను జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా చేయాలని ములాయం సింగ్ కు లేఖ రాసినందుకు , ఒక ఎమ్మెల్సీని క్రమశిక్షణ రాహిత్యం కింద ఆరేళ్ల పాటూ బహిష్కరించడం ఇవన్నీ కూడా అఖిలేష్ వర్గం మొత్తాన్ని బయటకు గెంటేస్తున్నారనడానికి స్పష్టమైన సంకేతాలుగానే ఉన్నాయి.

పార్టీలో కొందరు సీనియర్లు మాత్రం ... ఇలాంటి క్లిష్ట సమయంలో విడిపోవడం అనేది పార్టీ ఓడిపోవడానికి దారితీస్తుందని అటు ములాయం , ఇటు అఖిలేష్ మధ్య తిరుగుతూ రాజీ చర్చలు చేస్తున్నారు గానీ.. ఫలితం ఉండడం లేదు.

ఈ పార్టీలోని అన్ని పరిణామాలను భాజపా చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. అధికారం దిశగా వారి ఎన్నికల పోరాటం జరుగుతున్న సమయంలో అధికార పార్టీ విభేదాలు అనుకూలాంశమే అనుకుంటోంది.

Similar News