పోరుబాట ఖరారు చేసుకున్న టీకాంగ్రెస్ !

Update: 2016-10-15 15:29 GMT

తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు. అధికార తెరాస మీద అలుపెరగని పోరాటం చేస్తే తప్ప వచ్చే ఎన్నికల నాటికి తమ అస్తిత్వం కాపాడుకోవడం కష్టం అనే సంగతి వారికి అర్థమైపోయింది. పూర్తిగా ప్రజలకు రైతులకు సంబంధించిన ఎజెండా అంశాలను తీసుకుని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం లక్ష్యం అన్నట్లుగా వారు పోరాటాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవైపు హైదరాబాదులోను, అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఉద్యమాలు , పోరాటాలు నిరంతరాయంగా కొనసాగించడం ద్వారా నిలదొక్కుకోవాలనేది వారి ప్లాన్ గా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో రైతులకు అనుకూల పోరాటానికి దిగిన పీసీసీ నేత మల్లు భట్టి విక్రమార్క కలెక్టరు రైతుల మొరాలకించడానికి రాలేదంటూ.. రాత్రి అయిపోయినా కూడా ధర్నా కొనసాగిస్తూ.. హీట్ పెంచడం శనివారం నాటి కీలక పరిణామం.

అదే సమయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. భవిష్య కార్యాచరణ ను కూడా ప్రకటించేశారు. కేసీఆర్ సర్కారు మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదంటూ.. ఓ పెద్ద పోరాటాన్నే పీసీసీ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. కేబినెట్లో కనీసం ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదు అనే పాయింటును హైలైట్ చేస్తూ.. ‘‘ఓ మహిళా మేలుకో- తెలంగాణ ఏలుకో’’ అనే నినాదంతో సుదీర్ఘ కాల పోరాటాన్ని పీసీసీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇదే నినాదంతో పోస్టర్లను కూడా ఉత్తంకుమార్ రెడ్డి ఆవిష్కరించారు. కేసీఆర్ మహిళా వ్యతిరేకి అని, మహిళలంటే ఆయనకు గౌరవం లేదని, వారికి అర్హమైన పదవులు కూడా దక్కనివ్వరని ఈ పోరాటం ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నారు.

అదే సమయంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట జనాల్ని మోసం చేస్తున్నారని పీసీసీ చాలాకాలంగా ఆరోపణలు చేస్తోంది. వాటికి కార్యరూపం ఇస్తూ.. ఈనెల 19 న హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ప్లాన్ చేశారు. అలాగే రైతు సమస్యల మీద 20వ తేదీన మహబూబాబాద్ లో భారీ ఎత్తున ధర్నా కూడా నిర్వహించబోతున్నారు.

ఒకవైపు బహిరంగ సభలు, మరోవైపు ధర్నాలు ... ఇలా ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి పీసీసీ సన్నద్ధం అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

Similar News