పన్నులేని డిపాజిట్ పరిమితి పెరుగుతుందా?

Update: 2016-11-19 23:13 GMT

నరేంద్రమోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నల్లకుబేరుల ధనం వెలికితీసి ఒక్కో కుటుంబంలో 15 లక్షలు డిపాజిట్ చేస్తానని సెలవిచ్చారు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? దేశంలో ఉన్న నల్ల కుబేరులు తమ సొమ్మును, సామాన్యుల అకౌంట్లను వెతుక్కుని అందులో వేసుకుంటున్నారు. అందుకోసం వారికి కొంత కమిషన్ ను ముట్టజెపుతున్నారు. అంటే ఏదో ఒక రకంగా నల్లకుబేరుల బీరువాల్లో ఇన్నాళ్లూ మూలుగుతూ ఉండిన సొమ్ము ఇప్పుడు మధ్యతరగతి మరియు పేదల ఖాతాల్లోకి వస్తోంది. ఒక్కొక్క వ్యక్తి ఖాతాలో 2.5 లక్షల రూపాయల డిపాజిట్ వరకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రధాని మరియు ఆర్బీఐ ప్రకటించిన నేపథ్యంలో అంతా ఇదే జరుగుతోంది.

అయితే ఆంక్షలు లేని, పన్ను బెడద లేని నగదు డిపాజిట్ ల పరిమితిని పెంచడానికి కేంద్రం ఆలోచిస్తున్నదా ? అనే అభిప్రాయం తాజాగా కలుగుతోంది. దీనివలన నల్లకుబేరుల ధనం బురద గుంటలు, మంటల పాలవకుండా మరింతగా వెలుగులోకి వస్తుంది. మరింతగా వారికి సన్నిహితులైన మధ్యతరగతి అకౌంట్లలోకి వస్తుంది.

సాధారణంగా మోదీ సర్కారు అనుసరిస్తున్న పోకడలను బట్టి చూస్తే అలాంటి అవకాశం ఉన్నట్లు అనిపించదు గానీ.. తాజాగా నోట్ల రద్దు తర్వాత ప్రధానితో భేటీ అయిన మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆయన దృష్టికి తీసుకువెళ్లిన క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యల నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచన చేయవచ్చుననే వాదన పలువురిలో వినిపిస్తోంది.

జనం కష్టాలు, వారికి కల్పించాల్సిన వెసులుబాటు గురించి కేసీఆర్ ప్రధానంగా రెండు అంశాలు ప్రస్తావించారు. అందులో ఆంక్షలు లేని నగదు డిపాజిట్ల పరిమితిని పెంచడం మరియు సహకార బ్యాంకుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు అనుమతించడం అనేవి కీలకమైనవి. ఈ రెండూ అమల్లోకి వస్తే గనుక.. అనౌకౌంటెడ్ సొమ్ములు కలిగి ఉండే ఎంతో మందికి అది సదుపాయం అవుతుంది. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారికి చాలా ప్రయోజనం కూడా అవుతుంది. మరి కేసీఆర్ ప్రతిపాదించిన ముఖ్యమంత్రుల సమావేశాన్ని మోదీ నిర్వహిస్తారో లేదో, జనం కష్టాల గురించి అందరు సీఎం ల అభిప్రాయం తీసుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారో లేదో చూడాలి.

Similar News