టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి!

Update: 2016-10-22 03:07 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ చీఫ్ పీఠం మీద కన్నేసి ఉన్నారన్నది ఇవాళ్టి విషయం కాదు. తాజాగా ఆయన కొంత ఒరవడి మార్చి తన లక్ష్యం అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయ‌న‌దో ప్ర‌త్యేక ఒర‌వ‌డి.స్వ‌ప‌క్షంలోనే విప‌క్ష పాత్ర పోషించడం ఆయ‌న స్పెష‌ల్ .అది పిసిసి చీఫ్ అయ్యినా .. సిఎల్పీ లీడ‌ర్ అయ్యినా స‌రే మాట‌ల తూటాల‌తో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అయితే ఇప్పుడు ఉన్న‌ట్టుండి కోమ‌టిరెడ్డి త‌న స్టైల్ మార్చాడు.త‌న మాట‌ల యుద్దాన్ని గులాబీ గూటివైపు మ‌ళ్ళించారు. సిఎం కెసిఆర్ పై ఒక్క‌సారిగా దూకుడు పెంచారు.

హ‌స్తం పార్టీలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిది ఢిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ . స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంలా ఉండ‌టం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఎప్పుడు ఎవ‌రిని విమ‌ర్శిస్తారో అర్థంకాని ప‌రిస్థితి. సొంత‌పార్టీ నేత‌ల‌ను డైరెక్ట్ గా విమ‌ర్శించి ఎప్పుడూ వార్త‌ల్లో ఉండ‌టం ఆయ‌న‌కే చెల్లు. ఉన్న‌ది ఉన్న‌ట్లు కుండ‌బద్ద‌లు కొట్టిన‌ట్లుగా మాట్లాడ‌తార‌నే టాక్ ఆయ‌న‌పై ఉంది.ఎప్పుడూ నియోజ‌క‌వ‌ర్గం .. జిల్లాలో క్యాడ‌ర్ కు అందుబాటులో ఉంటూ కార్య‌క్ర‌మాల‌తో హ‌డ‌లెత్తించే ఆయ‌న .. పిసిసి ఇచ్చే రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా పాల్గొన‌క పోవ‌డం విశేషం. దీనికి కార‌ణం లేక‌పోలేదు. పిసిసి ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఆయ‌నకు మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఉండ‌ట‌మే.

అయితే ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌న స్టైల్ మార్చాడు. గ‌తంలో సొంత‌పార్టీపై ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేసే ఆయ‌న ఇప్పుడు అధికార‌పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా రైతు స‌మ‌స్య‌ల‌పై ప‌దేప‌దే మాట్లాడుతున్న ఆయ‌న ముఖ్య‌మంత్రి కెసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ప్రెస్ మీట్‌లు పెట్టి మ‌రీ విమ‌ర్శిస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ లో కెసీఆర్ ఓడిపోవ‌డం ఖాయమంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇక తాజాగా సెక్ర‌టేరియేట్ మార్పుపై కూడ ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సెక్ర‌టేరియేట్ మార్పును పిచ్చి తుగ్ల‌క్ చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. వాస్తు లేక‌పోతే ముఖ్యమంత్రి ప‌ద‌వినుంచి త‌ప్పుకోవాలంటూ విమ‌ర్శ‌లు చేశారు.

అయితే కోమ‌టి రెడ్డి కేసిఆర్ పై దూకుడు పెంచ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌దానిపై ర‌క ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. కోమ‌టి రెడ్డి దూకుడు వెనుక మ‌రో కోణం ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ ఆప‌రేషన్ ఆక‌ర్ష్ లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడ గులాబీ తీర్థం పుచ్చుకోనున్నార‌నే చ‌ర్చ ఓ ద‌శ‌లో పెద్దెత్తున న‌డిచింది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ సైతం దాదాపుగా ముహుర్తం రెడీ చేసుకున్న స‌మయంలో.. న‌ల్గొండ ఎంపి గుత్తాసుఖేంద‌ర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో షాక్ కు గురైన కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ .. తమ‌ను కాద‌ని గుత్తాను చేర్చుకున్నార‌ని ర‌గిలిపోయార‌నే చ‌ర్చ కూడా ఉంది. ఇక న‌యీంకు .. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు సంబంధాల‌పై టిఆర్ఎస్ ప్ర‌భుత్వం కావాల‌నే కుట్ర చేస్తోంద‌నే అబిప్రాయం కూడ వీరిలో ఉంది. మంత్రి జ‌గ‌దీష్ రెడ్డితో పాటు ప‌లువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు త‌మ‌ను టార్గెట్ చేస్తూ కేసులో ఇరికించ‌డానికి ప్ర‌య‌త్సిస్తున్నార‌ని గతంలో కోమ‌టిరెడ్డి చెప్పుకొచ్చారు. వీట‌న్నింటిని నేప‌థ్యంలోనే అధికార‌పార్టీపై నిప్పులు చెరుగుతున్నార‌నే వారు లేక‌పోలేదు.

ఇదిలా ఉంటే ఎప్ప‌టి నుంచో పిసిసి పీఠంపై క‌న్నేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి .. దాన్ని ద‌క్కించుకునేందుకు అధికార పార్టీ పై ఫైటింగ్ మోడ్ ప్ర‌ద‌ర్శిస్తేనే ప‌లితం ఉంటుంద‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే త‌న మాట‌ల తూటాల‌ను గులాబీ బాస్ పైకి ఎక్కు పెడుతున్న ఆయ‌న పార్టీ హైక‌మాండ్ మెప్పు పొందే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే కోమ‌టిరెడ్డి త్వ‌ర‌లోనే రైతు స‌మ‌స్య‌ల‌పై ఆమ‌ర‌ణ దీక్ష చేసేందుకు సిద్ద‌మౌతున్నారు. ఈ దీక్ష‌కు ఏఐసిసి అనుమ‌తి కూడా కోరిన‌ట్లు స‌మాచారం. మ‌రి మార్చిన త‌న పంథాతో కోమ‌టి రెడ్డి ఏమూర‌కు అనుకున్న‌ది సాధిస్తారో చూడాలి.

Similar News