గులాబీ తర్వాత వైకాపాదే దూకుడు!

Update: 2016-11-08 05:36 GMT

ఒకరేమో తెలంగాణ వ్యాప్తంగా అపరిమితమైన ప్రజాబలం, అధికార బలం కలిగిఉన్న పార్టీ. మరొకరేమో.. అసలు తెలంగాణలో తమ అస్తిత్వం ఉన్నదో లేదో తమకే సందేహం కలిగే రీతిలో కునారిల్లుతున్న పార్టీ! కానీ ఒకటిరెండు స్థానాల్లో ఈ రెండు పార్టీలే ఉండడం మాత్రం చోద్యమే. ఆ పోటీ మరేదో కాదులెండి... తెలంగాణలో కొత్త జిల్లాల వారీగా జిల్లా కమిటీలను నియమించే విషయంలో.. తెరాస తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే దూకుడు మీద ఉన్నట్లుగా కనిపిస్తోంది. 31 జిల్లాలకు కమిటీల ఏర్పాటును ఆ పార్టీ పూర్తి చేసేసింది.

నిజానికి జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత.. జిల్లా కమిటీలను నియమించి.. తమ పార్టీలను బలోపేతం చేసుకోవడం గురించి విపక్షాలలో కాంగ్రెస్, తెలుగుదేశం తీవ్రంగానే కసరత్తు చేస్తున్నాయి. కసరత్తులు జరుగుతూ ఉన్నాయే తప్ప.. ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అధికార పార్టీ బలాన్ని తట్టుకుంటూ.. జిల్లాల్లో పార్టీ మనుగడకు కీలకంగా వ్యవహరించాల్సింది జిల్లా కమిటీలే గనుక.. వీరు కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెడుతున్న మాట వాస్తవం. అందుకే జాప్యం జరుగుతోంది కూడా!

అయితే తెలంగాణ రాష్ట్రసమితి పరిస్థితి వేరు. అధికార పార్టీగా వారికి కార్యకర్తల బలం, నాయకుల బలం పుష్కలంగా ఉంది. పైగా కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా కులాల గణన, ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యపు ప్రాతిపదిక అన్నిటినీ పరిగణించి జిల్లా కమిటీలను పూర్తిచేశారు. అయితే.. రెండో స్థానంలో వైకాపా ఉండడమే విశేషం.

నిజానికి తెలంగాణలో వైకాపా ఊసు కూడా లేదన్నది వాస్తవం. ఆ పార్టీ తరఫున గెలిచిన వారంతా గులాబీ తీర్థం పుచ్చుకోగా.. ఏదో నామమాత్రావశిష్టంగా పార్టీకి రాష్ట్ర కమిటీ ఉంది. ఏదో అప్పుడప్పుడూ ఒక ప్రకటన విడుదలచేసి తమ అస్తిత్వాన్ని చాటుకుంటూ ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు జిల్లా కమిటీల ఏర్పాటులో మాత్రం వైకాపా చాలా ముందుంది. వారు అప్పుడే 31 జిల్లాల కమిటీలను వేసేశారు. మొత్తానికి అన్ని జిల్లాల్లో తమకు ఎంతో కొంత కేడర్ ఉన్నదని చెప్పుకోగల స్థితిలో వైకాపా ఉండడం ఆ పార్టీకి శుభపరిణామమే.

Similar News