కొడుకు మీద ప్రేమతో వ్యూహాత్మక రాజకీయాలా?

Update: 2016-10-18 05:10 GMT

యూపీలో ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత రాజకీయం అనేక మలుపులు తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ యాదవ్ మీద ఆగ్రహంతోనే ములాయం నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదా వ్యూహాత్మకంగా కొడుకుకు మార్గం సుగమం చేయడానికి అలా కనిపిస్తున్నారా అర్థం కావడం లేదు గానీ.. మొత్తానికి రాజకీయ పరిణామాలను శరవేగంగా మార్చేస్తున్నారు. తొలుత అఖిలేష్ సీఎం అభ్యర్థి కాదు, పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.. అని ప్రకటించిన పార్టీ అధినేత.. సోమవారం నాడు.. అఖిలేషే సీఎం అభ్యర్థి అనే నినాదాన్ని చెప్పడం విశేషం. ఇప్పుడు అఖిలేష్ సీఎం అభ్యర్థి అని చెప్పుకునే ఎస్పీ ఎన్నికల బరిలో తలపడనుంది.

అయితే అఖిలేష్ సీఎం అభ్యర్థి కాదు అని ములాయం ప్రకటించినప్పుడే.. తెలుగుపోస్ట్ డాట్ కామ్ ఓ ప్రత్యేక కథనాన్ని అందించింది. ‘వార్నింగ్ ఇచ్చింది కూడా కొడుకు మీద ప్రేమతోనేనా? ’ అనే శీర్షికతో ఇచ్చిన ఆ కథనంలో పార్టీ ఓటమి పాలైతే.. ఆ బాధ్యత కొడుకు వైఫల్యాల మీద పడకుండా ఉండేందుకు ములాయం ఇలా వ్యూహాత్మకంగా చేశారా? అనే అనుమానాలు వెల్లడయ్యాయి.

అయితే, ఇప్పుడు తాజాగా అఖిలేష్ పేరును ఖరారు చేసిన నేపథ్యంలో ... పార్టీ అంతర్గత రాజకీయాలు, ముఠాల నేపథ్యంలో అఖిలేష్‌కు ఎదురులేకుండా చేయడానికే ఇలా రివర్స్ స్ట్రాటెజీ నడిపించారని కూడా ప్రచారం జరుగుతోంది. ముందుగా అలాంటి ప్రకటన రావడంతో.. పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఒకవేళ పార్టీ ఓడిపోతే గనుక.. అఖిలేష్ ను సీఎం చేయడం లేదు గనుక.. ఓడిపోయినట్లు అర్థం వస్తుందని రాంగోపాల్ యాదవ్ లాంటి వాళ్లు వాదించారు. ఆ మాటలను కూడా పరిగణనలోకి తీసుకున్న ములాయం తన సోదరులతో కూడా చర్చించి.. చివరికి మళ్లీ అఖిలేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం విశేషం. అయితే సోదరుల్లో కొడుకు అభ్యర్థిత్వం పట్ల విముఖత ఉండకుండా, తర్వాత వారు ప్రతికూలంగా మాట్లాడకుండా ఉండేందుకే ఆయన ముందుగా అలా చెప్పి, వారితోనే ఆ ప్రతిపాదన వచ్చే పరిస్థితి సృష్టించారనే వాదన కూడా వినిపిస్తోంది.

Similar News