కమిషన్ల దందాలు సాలెగూడే : పేదలూ జర జాగ్రత్త!

Update: 2016-11-18 14:28 GMT

దేశవ్యాప్తంగా ఇప్పుడు కమిషన్ల దందా నడుస్తోంది. నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా.. అనేక మంది సామాన్యులను ఆశ్రయించి, దళారీలను ఆశ్రయించి, బ్యాంకర్లను ఆశ్రయించి రకరకాల మార్గాల్లో నల్లకుబేరులు లబ్ధి పొందుతున్నారు. 30 నుంచి 40 శాతం కమిషన్ గా తీసుకుని.. సొమ్ములను సామాన్యుల ఖాతాల్లో వేసి.. కొన్ని నెలల తర్వాత తిరిగి తీసుకునేలా ఈ దందా నడుస్తోంది. అయితే మధ్యతరగతి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది గానీ... సామాన్యుల విషయంలో ఈ దందా ఓ సాలెగూడు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిరుపేదలు గనుక.. కమిషన్ డబ్బులకు ఆశపడి.. ఇలాంటి దందాకు సహకరిస్తే.. వారు చాలా రకాలుగా నష్టపోతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అనౌకౌంటెడ్ డబ్బును కలిగి ఉన్న వారు.. సామాన్యులను ఆశ్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ అకౌంట్లలో 2.5 లక్షల రూపాయల డిపాజిట్ వేసుకుంటే గనుక.. వాటి గురించి పట్టించుకోబోయేది లేదని మోదీ సర్కారు మినహాయింపు ఇచ్చిన నేపథ్యంలో అలా నమ్మకస్తులుగా డబ్బు తిరిగి ఇవ్వగలిగిన వారిని వెతుక్కుంటున్నారు. ఆ క్రమంలో భాగంగా నిరుపేదలకు కూడా అవకాశం పలకరిస్తోంది. 2.5 లక్షల రూపాయలు తీసుకుని తమ అకౌంట్లో వేసుకుని, రెండు మూడునెలల తర్వాత.. తిరిగి డ్రా చేసి ఇస్తే అందులో 30 శాతం కింద 75 వేల రూపాయలు తమకు లాభం కింద దక్కుతాయి. అంటే సొమ్ములిచ్చిన వారికి తిరిగి 1.75 లక్షలు ఇస్తే సరిపోతుంది. ఇలాంటి ఆఫర్లకు సహజంగానే పేదలు ఆశపడుతున్నారు.

కాకపోతే ఈ దందాలు ఓ సాలెగూడు అని , నిరుపేదలు చిక్కుకుంటే చిక్కులేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఇంత పెద్ద మొత్తాలు వారి ఖాతాల్లో జమ అయితే గనుక.. వారికి ఉండే ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పరమైన సదుపాయాలను, తెల్ల రేషన్ కార్డులను కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అదే జరిగితే.. ఏదో ఒకసారికి వచ్చే 75 వేల రూపాయల లాభం కోసం.. జీవితాంతమూ ఉండే ప్రభుత్వ పరమైన సదుపాయాలను చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుంది. అందుకే.. ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు నిరుపేదలు, తెల్లరేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఆశకు పోకుండా జాగ్రత్త పడాలని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

Similar News