సర్దార్ గబ్బర్ సింగ్ రివ్యూ!

Update: 2016-04-08 12:47 GMT

గ‌బ్బ‌ర్ సింగ్‌... ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికి మించి ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల్లో విప‌రీత‌మైన జోష్ తీసుకొచ్చిందీ సినిమా. టీవీలో గ‌బ్బ‌ర్ సింగ్ వ‌స్తోందంటే... ఇప్ప‌టికే టీ ఆర్ పీ రేటింగులు అదిరిపోయాయి. ఇప్పుడు ఆ పేరుని వాడుకొంటూ ఓ సినిమా వ‌స్తోందంటే ఎన్ని అంచ‌నాలుంటాయి?? ప‌వ‌న్ అభిమానులు ఎంతగా ఆశ ప‌డ‌తారు?? అలానే జ‌రిగింది. స‌ర్దార్ - గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాపై ఎన్ని లెక్క‌లో, ఇంకెన్ని ఆశ‌లో! ఆ సంగ‌తి ఈ సినిమా మొద‌లెట్ట‌క ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ్ గ్యాంగ్‌కి తెలుసు. తెలిసిన‌ప్పుడు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి, ఎంత ప‌క‌డ్బందీగా న‌డుచుకోవాలి? క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ అనే పాత్ర విష‌యంలో ఎన్ని లెక్క‌లేసుకోవాలి..??? అవన్నీ టోట‌ల్ గా త‌ప్పేస్తే... ఎలా ఉంటుందో?? ప‌వ‌న్ తిక్క ముదిరితే దాని లెక్క ఏ రేంజులో ఉంటుందో చెప్పే సినిమానే.. ఈ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌.

నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వ‌ను.. సెట్ చేస్తా.. అంటాడు గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే ఈ స‌ర్దార్ మాత్రం ట్రెండ్‌ని ఫాలో అయిపోయాడు. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ బాట‌కి ఓ ఇంచు అటూ ఇటూ కాకుండా ఓ రొటీన్ రొడ్డ‌కొట్టుడు స్టోరీ రాసుకొన్నాడు. కొత్త ద‌నం ముందు ఓ గీత గీసి దాన్ని దాట కూడ‌ద‌ని ఒట్టు వేసుకొని ఆ ఒడ్డుకి వంద కిలోమీట‌ర్ల దూరంలో నిల‌బ‌డిపోయాడు. స‌ర్దార్ గబ్బ‌ర్ సింగ్ క‌థ‌లో అణువంత కూడా వైవిద్యం క‌నిపించందు. ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్‌. ర‌త‌న్ పూర్ గ్రామాన్ని అల్లాడిస్తుంటాడు. త‌న మైనింగ్ కోసం వ్య‌వ‌సాయ భూముల్ని లాక్కుంటాడు. న‌న్ను ఆపేదెవ‌డూ.. అంటూ విర్ర‌వీగుతుంటే.. స‌డ‌న్‌గా అప్పుడే హీరోగారి ఎంట్రీ. ఎక్క‌డో పోలీస్ గా జాబ్ చేసుకొంటున్న స‌ర్దార్‌.. ట్రాన్స్ ఫ‌ర్ అయి వ‌స్తాడు. అక్క‌డ్నుంచి హీరోకీ విల‌న్‌కి మ‌ధ్య యుద్దం మొద‌ల‌వుతుంది. మ‌ధ్య‌లో ర‌త‌న్ పూర్ రాజ సంస్థాన‌పు యువ‌రాణి (కాజ‌ల్) క‌థ‌. ఆమెను స‌ర్దార్ ప్రేమిస్తాడు. విల‌న్ కామిస్తాడు. విల‌న్ బారీ నుంచి యువ‌రాణిని, ర‌త‌న్ పూర్‌ని హీరో ఎలా ర‌క్షించాడు.?? అనేదే ఈ సినిమా స్టోరీ.

ట్రెండ్‌ని సెట్ చేసే కెపాసిటీ ఉన్న ప‌వ‌న్‌.. ఇలా ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు, ఒక విధంగా చెప్పాలంటే బీసీ ట్రెండుని ఇప్పుడు గుర్తుకు తెస్తూ ఓ క‌థ రాసుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. స్ర్కీన్ ప్లే బాధ్య‌త కూడా త‌న నెత్తిమీదే వేసుకొన్న ప‌వ‌న్‌... ఈ రొటీన్ క‌థ‌ని మ‌రింత నాశిర‌కంగా త‌యారు చేయ‌డంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. విల‌న్ అరాచ‌కాలు, హీరో ఎంట్రీ, అక్క‌డ ఓ పోరాట దృశ్యం, వెంట‌నే ఓ పాట‌... ఇలా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు అనుగుణంగా. స్కేలు పెట్టి కొలిచిన‌ట్టు న‌డిచిపోతుంటాయి. ప‌వ‌న్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. న‌డిరోడ్డుపై తేడా పాట‌ల‌కు మ‌రింత తేడాగా స్టెప్పులేస్తుంటాడు. అదీ ఐదో సీనులో. ఈ సినిమాపై నెగిటీవ్ ఇంప్రెష‌న్ అక్క‌డి నుంచే కొట్ట‌డం మొద‌లైపోతుంది. హీరో పాత్ర బ‌లంగా ఉండాలి అనుకోవ‌డం త‌ప్పు కాదు. క‌నీసం హీరో పాత్ర అయినా స్ట్రాంగ్ గా లేక‌పోతే ఎలా?? ఆ క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసుకోవ‌డంలోనూ లోపాలు క‌నిపిస్తాయి. క‌థ, పాత్ర‌ల చిత్రీక‌ర‌ణ అటుంచితే.. స‌న్నివేశాల‌న్నీ పైపైనే ప‌రుగెడుతుంటాయి. ప‌వ‌న్ ఏదేదే చేస్తాడు. అత‌ని చేష్ట‌ల‌కూ క‌థ‌కూ సంబంధం ఉండ‌దు. కొన్ని స‌న్నివేశాలు ఎందుకు వ‌స్తాయో, స‌డ‌న్‌గా ఎందుకు ఆగిపోతాయో తెలీదు. చాలా స‌న్నివేశాల్ని ప్రోప‌ర్‌గా డిజైన్ చేసుకోలేదు. ప‌వ‌న్ తాలుకూ మార్క్ ప్ర‌తీ ఫ్రేములోనూ క‌నిపిస్తుంది. ఈసినిమాకి బాబి కాదు ద‌ర్శ‌కుడు ప‌వ‌నే.. అనే విష‌యం ఆ ఫ్రేము డిజైనింగ్‌, ఆమ‌ధ్య‌లో పాత్ర‌లు వేసే వెర్రి వేషాలు చూస్తేనే అర్థ‌మైపోతుంది.

తెర‌పై ఇంత అరాచ‌కం జ‌రుగుతున్నా.. భ‌రించామంటే దానికి కార‌ణం.. ప‌వ‌న్ క‌ల్యాణే. త‌న స్ర్కీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్ష‌కుల్ని విసుగు అనే ప‌దానికి కాస్త దూరంగానే కూర్చోబెట్టాడు. అయితే.. అదీ కాసేపే. ఇంట్ర‌వెల్ త‌ర‌వాత ఈ సినిమా పూర్తిగా ట్రాక్ త‌ప్పేస్తుంది. హీరో - విల‌న్ ల మ‌ధ్య స‌రైన క్లాష్ ఉండ‌దు. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమాట ఎప్ప‌టికీ తెవ‌ల‌దు. సినిమా అయిపోయింద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. కానీ.. శుభం కార్డు ప‌డ‌దు. సంగీత్ పేరుతో... డాన్సులు చేసి ర‌చ్చ ర‌చ్చ చేశాడు వ‌ప‌న్. అవి మెగా అభిమానుల‌కు న‌చ్చొచ్చేమో..? మిగిలిన వారి మాటేంటి?? గ‌బ్బ‌ర్ సింగ్‌లో అంత్యాక్ష‌రి ఎపిసోడ్ క్లిక్క‌య్యిదంటే... ఆ ఎపిసోడ్ ప్లేస్ మెంట్ కీల‌కం. పైగా రౌడీల చేత పాట‌లు పాడించి స్టెప్పులు వేయించ‌డం కొత్త‌గా అనిపించింది. సేమ్ ఆ రౌడీల‌నే తీసుకొచ్చి మ‌ళ్లీ అదే సీన్ రిపీట్ చేయించాడు ప‌వ‌న్‌. అయితే ఈసారి. ప‌వ‌న్ స్టెప్పులు వేశాడు. అక్క‌డే హీరోయిజం.. డ్ర‌యినేజీలో క‌ల‌సిపోయింది. విల‌న్ గ్యాంగ్లో ఓ స‌బ్ గ్యాంగ్ స‌డ‌న్‌గా మారిపోయి, వాళ్ల‌కు జ్ఞానోద‌యం అయి.. విల‌న్ వైపే గ‌న్నులు ఎక్కిపెట్టే త‌ర‌హా క్లైమాక్స్.. ప‌వ‌న్ రాసుకొన్నాడంటే ఇంకా ఆయ‌న ఏ కాలంలో ఉండిపోయాడా అనిపిస్తుంది. సినిమా మొత్తానికి అరె.. ఈ సీన్ బాగుంది.. అనుకొనేలా లేని.. ప‌వ‌న్ సినిమా ఇదేనేమో???

ప‌వ‌న్‌లో అంద‌రికీ న‌చ్చే విష‌యం... త‌న‌లోని ఎన‌ర్జీ. అయితే ఎందుకో ఈ సినిమాని ప‌వ‌న్ మ‌న‌సు పెట్టి చేయ‌లేదేమో అనిస్తుంది. కొన్ని స‌న్నివేశాల్లో హుషారుగానే ఉన్నాడు. ఇంకొన్ని స‌న్నివేశాల్లో మాత్రం ఏదో నామ్‌కే వాస్తే న‌టించాడా అనిపిస్తుంది. పాట‌ల్లో లిప్ మూమెంట్ ఇవ్వ‌డానికి కూడా వ‌వ‌న్‌కి ఇంత బ‌ద్ద‌క‌మా అన్న డౌట్ వ‌స్తుంది. నీ చేప‌క‌ళ్లు పాట‌లో ప‌వ‌న్ స్టెప్పులు చూస్తే... డాన్సులు వేయ‌డం ప‌వ‌న్‌కి అంత ఇష్టం లేదా? అన్న అనుమాన‌మూ క‌లుగుతుంది. నేను ఎలా చేసినా, ఏం చేసినా జ‌నం చూస్తారు.. అని ప‌వ‌న్ ఫిక్స‌యితే మాత్రం ఏం చేయ‌గ‌లం?

కాజ‌ల్ నీ అందంగా చూపించ‌లేక‌పోయారు. ఆమె మేక‌ప్ అస్స‌లు బాలేదు. పాట‌ల్లో మాత్రం అందంగానే క‌నిపించింది. అయితే దుస్తుల ఎంపిక‌లో కాజ‌ల్ మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప‌వ‌న్ ఈ సినిమాలో చాలా అందంగా క‌నిపించాడు. పాట‌ల్లో త‌న డ్రెస్సింగ్ సెన్స్ కూడా న‌చ్చ‌తుంది. కెమెరా ఎప్పుడూ ప‌వ‌న్ మీదే పోక‌స్ అవ్వాలి అని చిత్ర‌బృందం ఫీలై ఉంటుంది. కాబట్టి విల‌న్ పాత్ర‌కు త‌ప్ప మిగిలిన వాళ్ల‌కు పెద్ద గా సంభాష‌ణ‌లు ఇవ్వ‌లేదు. జ‌బ‌ర్ ద‌స్త్ బృందం, పేరున్న న‌టీన‌టులు ఇంత‌మంది ఉన్నా ఎవ్వ‌రూ ప‌ట్టుమ‌ని ప‌ది డైలాగులు కూడా ప‌ల‌క‌లేదు.

దేవీశ్రీ త‌న వ‌ర్క్ విష‌యంలో నిరాశ ప‌ర‌చ‌లేదు. మంచి పాట‌లిచ్చాడు. ఆర్‌.ఆర్‌లోనూ ప‌నిత‌నం చూపించాడు. నిల్స‌న్ కెమెరా ప‌నిత‌నం కూడా ఆక‌ట్టుకొంటుంది. ఎడిటింగ్ అస్స‌లు బాలేదు. సీన్ల మధ్య లింక్ లేదు. బాబికి ప‌వ‌న్ డైరెక్ష‌న్ చేయించాడా, లేదా అన్న అనుమానం ఈ సినిమా చూస్తుంటే మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. ఇంట్ర‌వెల్ ముందొచ్చే ఫైట్ సీన్‌.. బాగుంది. అయితే ఆ ఫైట్‌ని మ‌రింత ఎమోష‌న‌ల్‌గా తీయొచ్చేమో అనిపిస్తుంది. ప‌వ‌న్ ప‌లికిన డైలాగుల్లో కొన్ని ఆక‌ట్టుకొంటాయి. విల‌న్ పాత్ర‌కీ రాసిన సంభాష‌ణ‌లు బాగున్నాయి. గోల్ప్ అంటే గొప్పోళ్లాడుకొనే గోళీలాట‌... అన్న డైలాగ్ బాగుంది.

బోట‌మ్ లైన్‌: స‌ర్దార్‌,.. ప‌వ‌న్ వీరాభిమానుల‌కు మాత్ర‌మే

Similar News