ప్రేమమ్ రివ్యూ 2

Update: 2016-10-07 15:36 GMT

నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోన్నా సెబాస్టియాన్, అరవింద్ క్రిష్ణ, చైతన్య క్రిష్ణ, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ రాజ్, నర్రా శ్రీను, బ్రహ్మాజీ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ తదితరులు.

కథ : అల్ఫోన్స్ పూతరేన్

సంగీతం : గోపి సుందర్, రాజేష్ మురుగేశన్

ఛాయాగ్రహణం : కార్తిక్ ఘట్టమనేని

కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు

నిర్మాతలు : ప్రసాద్ పి.డి.వి, ఎస్.రాధా క్రిష్ణ, ఎస్. నాగ వంశి

కథనం, దర్శకత్వం : చందూ మొండేటి

ఇతర భాషా చిత్రాలను మాతృక భాషలోనే ఒకసారి ఐనా చూసే ప్రేక్షకులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఆలా మన ప్రేక్షకులు ఇతర భాషల్లోని ఎన్నో ప్రేమ కథలను చూస్తూనే ఉన్నారు. కానీ మళయాళ వినూత్న ప్రేమ కథ ప్రేమమ్ మన ప్రేక్షకుల మనసులపై వేసిన ముద్ర ఇంకా చేరగలేదు. అటువంటి కవితాత్మక ప్రేమ కావ్యం పునర్నిర్మించి మాతృకను మచ్చుకైనా గుర్తు చేసుకునే వెసులుబాటు ప్రేక్షకుడికి కలిపించకుండా మంత్ర ముగ్ధులుని చేయటం మహా గొప్ప ధైర్య సాహసమే. మరి అటువంటి సాహసానికి పూనుకున్న నాగ చైతన్య చందూ మొండేటి ల కాంబినేషన్ పని తీరు ఎంత వరకు ప్రశంసనీయమో పూర్తి సమీక్ష లో చర్చిద్దాం.

కథ : విక్రమ్ (నాగ చైతన్య) తన ఇద్దరు స్నేహితుల (చైతన్య క్రిష్ణ, ప్రవీణ్)లతో కలిసి స్కూల్ లో చదువుకునే రోజులలో, బాల్యానికి యవ్వనానికి మధ్య ప్రాయంలో హేమ (అనుపమ పరమేశ్వరన్) అనే విద్యార్థినికి ఆకర్షితుడు అవుతాడు. ప్రతి రోజూ హేమ ఇంటి వరకు వెంట వెళ్తూ తన ప్రేమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటాడు. హేమ తండ్రి (పృథ్వి రాజ్) విక్రమ్ చేసే అల్లరి చర్యలను ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. ఒక రోజూ హఠాత్తున హేమ తన ప్రియుడిని విక్రమ్ కి పరిచయం చేసి విక్రమ్ ఆశలపై నీళ్లు జల్లుతుంది. కొంత కాలానికి విక్రమ్ డిగ్రీ కాలేజీ లో చదువుతున్న సమయంలో కొన్ని అల్లర్లకు కారణం అవుతూ రోజులు గడుపుతుండగా అదే కాలేజీ లో ప్రొఫెసర్ గా వస్తుంది సితార(శృతి హాసన్). సితార కు ఆకర్షితుడైన విక్రమ్, తన చూపును అతనిపైకి మలుచుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎట్టకేలకు అతని ప్రయత్నాలు ఫలించి, సీతారాతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ సాన్నిహిత్యాన్ని ప్రేమ అనే భావంతో ఉంటాడు విక్రమ్. కాలేజీ సెలవులకు తన ఊరు వెళ్లిన సితార రోడ్డు ప్రమాదానికి గురై తన గతాన్ని మరచిపోతుంది. మరి కొంత కాలానికి మానసిక పరిపక్వత చెందిన మధ్య వయస్తుడిగా విక్రమ్ తన బాల్య స్నేహితులతో కలిసి ఒక బేకరీ నడుపుతుంటాడు. ఆ బేకరీ కి వచ్చిన సింధు(మడోన్నా సెబాస్టియాన్) విక్రంని గుత్తిపట్టి పలకరిస్తుంది. కానీ విక్రమ్ తనను గుర్తు పట్టకపోవటంతో తానే తన వివరాలు చెప్తుంది. తాను హేమ చెల్లెలు అని విక్రమ్ కి తెలుస్తుంది. సింధు నే చనువు తీసుకుని విక్రంకి చేరువ అవుతుంది. మరి చివరికి విక్రమ్ ఎవరిని వివాహమాడాడు? తన మొదటి ప్రేమని గెలిపించుకునే ఉద్దేశంతో హేమ నా?? కాలేజీ వయసు రొమాంటిక్ ప్రేమ ఐన సితార నా?? మానసిక పరిపక్వత తెలిసి ఆకర్షణకి ప్రేమకి వ్యత్యాసం తెలిసాక పరిచయం ఐన సింధు నా?? అనేది తెర పై చూడాలి.

విశ్లేషణ : అక్కినేని నాగ చైతన్య ఎన్ని రకాల పాత్రలు ప్రయత్నించినా ప్రేక్షకులు అతనిని ప్రేమ కథా చిత్రాలలో మాత్రమే జీర్ణించుకోగలిగారు. అయితే ఈ ప్రేమమ్ చిత్రంలో మూడు వివిధ వయస్థుల మానసిక పరిస్థితులకి అనుగుణంగా వారు ప్రేమకు స్పందించే తీరును ప్రదర్శించే పాత్రను పోషించాడు. ఇటువంటి పాత్ర నాగ చైతన్య చెయ్యటం మొదటి సారి, పైగా నివిన్ పౌలి ఆ పాత్రలో ఎంతో మెప్పు పొందే సరికి చైతు పై అదనపు అంచనాల భారం పడింది. బాల్యం నుంచీ యవ్వన దశకు మధ్య వయసులో వుండే పాత్ర తీరు తెన్నులలో కొన్ని అవకతవకలు కనిపించినా నటన విషయంలో మాత్రం పూర్తిగా అలరించాడు నాగ చైతన్య. మిగిలిన రెండు పాత్రల వేష దారణ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. భారీ అంచనాలను తన అద్భుత నటనతో అలవోకగా అందుకున్నాడు చైతన్య. ఇక కథానాయికల విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ మనకు పరిచయం ఉన్న భామలు కాగా మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంతోనే పరిచయమైయ్యింది. పాత్రల నిడివి గురించి కన్నా పాత్రల ప్రాధాన్యత విషయాన్ని చర్చించుకుంటే ముగ్గురి పాత్రల్లో దేనికి వోట్ వెయ్యాలో తెలియక తికమక పడటమే మన వంతు అవుతుంది. అంత అద్భుతంగా కథానాయికల పాత్రలను కథానుసారం చిత్రీకరించి, ప్రేమ వైఫల్యాలకు ప్రేక్షకుడు స్పందించి దుఃఖించేలా తీర్చి దిద్దారు దర్శకుడు చందూ మొండేటి. వెంకటేష్ నాగ చైతన్యకు మామయ్యగా అతిధి పాత్ర పోషించి కాలేజీ ప్రిన్సిపాల్ రూంలో జరిగే సన్నివేశం లో ఎప్పటిలానే అలరించారు. మిగిలిన నటీనటులందరికి కూడా నామమాత్రపు పాత్రలు కాకుండా ప్రేక్షకులకు చేరువ అయ్యే పాత్రలే సృష్టించాడు చందూ మొండేటి.

సాంకేతిక బృందం : చిత్రీకరణ కు ఎంచుకున్న లొకేషన్స్ ని అద్భుతం గా తెర పై రిజిస్టర్ చేసాడు ఛాయాగ్రాహకుడు కార్తిక్ ఘట్టమనేని. మనకు పరిచయం లేని మడోన్నా సెబాస్టియన్ ను చాలా అందంగా తెర పై ఆవిష్కరించిన ఘనత కార్తిక్ కి దక్కుతుంది. వివిధీ వయసు ప్రాయాలలో సాగే కథకి అనుగుణంగా తన లైటింగ్ అండ్ కెమెరా టెక్నిక్స్తో కథతో ప్రేక్షకుడు నిత్యం ప్రయాణం చేసేలా జాగ్రత్త వహించాడు కార్తీక్. కోటగిరి వెంకటేశ్వర రావు కత్తెర కథ ప్రారంభంలో కొంత తడబడినా, కాలేజీ ఎపిసోడ్స్ నుంచి ఎక్కడా లాగ్ అనిపించని విధంగా కథను ఆసక్తికరంగా నడిపింది. గోపి సుందర్, రాజేష్ మురుగేషన్ల సంగీతం ప్రధాన ఆకర్షణ. పాటలతో పాటు నేపధ్య సంగీతం కూడా ప్రేక్షకుడిని కథలో లీనం చేసింది.

మళయాళ ప్రేమమ్ చిత్ర కథ కు తన శైలిలో కథనం అందించిన చందూ మొండేటి, మొదటి ఎపిసోడ్ విషయంలో పూర్తి స్థాయి జాగ్రత్తలు వహించలేకపోయారు అని అనిపించింది. తర్వాత కథనం సాగే తీరుకు మంత్ర ముగ్ధుడు ఐన సగటు ప్రేక్షకుడు ఆ చిన్నపాటి కథనం లోని లోపాలను క్షమించక మానడు. దర్శకుడిగా ప్రేమమ్ అనే మళయాళ మధుర కావ్యాన్ని అంతే అనుభూతి ని కలిగించే విధంగా తెరకెక్కించి, ఇటువంటి కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పాలి అనే తన ధైర్య సాహసాలతో అద్భుతమే సృష్టించాడు.

ప్లస్ పాయింట్స్ : నాగ చైతన్య, మడోన్నా సెబాస్టియన్, కథ, ఛాయాగ్రహణం, సంగీతం, దర్శకత్వం

మైనస్ పాయింట్స్ : నాగ చైతన్య మొదటి పాత్ర స్క్రీన్ అప్పీరెన్స్, శృతి హాసన్ స్క్రీన్ అప్పీరెన్స్, కథ టేక్ ఆఫ్ లో నెమ్మదించిన కథనం

రేటింగ్ : 3.25/5

Similar News