తిక్క మూవీ రివ్యూ

Update: 2016-08-13 05:09 GMT

నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌, లారిసా బోనేసి, మన్నారా చోప్రా, రాజేంద్రప్రసాద్‌

సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌

నిర్మాత: డా. సి.రోహిన్‌కుమార్‌రెడ్డి

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సునీల్‌రెడ్డి

రేటింగ్: 1.5/5

వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈసారి 'తిక్క' చూపిస్తానంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ఓం' వంటి ప్లాప్ సినిమా తీసిన సునీల్ రెడ్డి కి ఈ 'తిక్క' సినిమా డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు సాయి ధరమ్ తేజ. ఈ సినిమాకు కొత్త నిర్మాత రోహిత్ కుమార్ రెడ్డి నిర్మించాడు. మరి ఈ కొత్త నిర్మాత ఒక ప్లాప్ డైరెక్టర్ మీద అంత నమ్మకాన్ని పెట్టుకుని 'తిక్క' సినిమాని నిర్మించాడు. ఇందులో సాయి ధరం తేజాకి జోడిగా కొత్త హీరోయిన్ లారిసా బోనేసి నటించింది. ఇంకో హీరోయిన్ గా జక్కన సినిమాలో చేసిన మన్నారా చోప్రా నటించింది. ఇప్పటికే 'పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, సుప్రీమ్‌' వంటి కమర్షియల్‌ హిట్స్‌తో హీరోగా తన రేంజ్‌ని పెంచుకుంటూ వెళ్తున్న సాయిధరమ్‌తేజ్‌ని తిక్క చిత్రం ఎలాంటి విజయాన్ని అందించింది. సాయి ధర్మ తేజ ని సునీల్ రెడ్డి ఈ సినిమాలో ఎలా చూపించాడు... లారిసా బోనేసి, మన్నారా చోప్రా లు సాయి ధరమ్ పక్కన జోడిగా సరిపోయారా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ: ఆదిత్య (సాయి ధరమ్ తేజ) అల్లరి పనులు చేస్తూ బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. కేవలం తాగుతూనే కాలం గడిపేస్తూ ఉంటాడు ఆదిత్య. ఆలా అల్లరి చిల్లరగా తిరిగే ఆదిత్య జీవితం లోకి మన హీరోయిన్ అంజలి( లారిసా బోనేసి) ప్రవేశిస్తుంది. మొదటిసారి కలవగానే అంజలి ప్రేమలో పడిపోతాడు ఆదిత్య. కొన్నాళ్ళకు అంజలి కూడా ఆదిత్యని ప్రేమిస్తుంది. అయితే వీరిద్దరూ ఆలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సమయం లో ఆదిత్యని వదిలి వెళ్ళిపోతుంది అంజలి. అంజలి వదిలిపెట్టి వెళ్ళగానే ఆదిత్య పిచ్చిపట్టిన వాడిలా తిరుగుతూ ఉంటాడు. ఇక తాగుడు అనేది ఎలాగూ వుంది కాబట్టి అలా తాగుతూ చిన్న తప్పులు చేస్తూ ఉండిపోతాడు. మరి అంజలి మారి ఆదిత్య దగ్గరికి వస్తుందా... ఆదిత్య తన తప్పు తెలుసుకుని తాగడం మానేస్తాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అసలు కథ గా చెప్పుకోవడానికి ఇందులో అసలేమీ ఉండదు. దర్శకుడు మరి 'తిక్క' సినిమాని అలా తెరకెక్కించాడు.

పనితీరు: 'ఓం' వంటి భారీ ప్లాప్ తీసిన దర్శకుడు సునీల్ రెడ్డికి అవకాశం ఇచ్చి సాయి పెద్ద తప్పు చేసాడనే చెప్పాలి. అసలు ఈ సినిమాలో కేవలం వెకిలితనం, ఆడియన్స్‌కి తిక్క పుట్టించే సీన్స్‌, భయపెట్టే గెటప్స్‌, సహనాన్ని పరీక్షించే మాటలు.. ఇలా ఆద్యంతం తిక్క తిక్కగా సాగే ఈ చిత్రంలో ప్లస్‌ పాయింట్స్‌ ఏం వున్నాయి అని కాగడా పెట్టి వెతికినా ఒక్కటీ కనిపించదు. ఇక సాయి కేవలం సిగరెట్టూ తాగడం, మందు తాగడం తో సినిమా అంతా గడిచిపోతుంటుంది. ఇక సాయికి తండ్రిగా చేసిన రాజేంద్ర ప్రసాద్ ఇంకా పెద్ద తాగుబోతు. అంత పెద్ద వయసులో రాజేంద్రప్రసాద్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుందంట. అయితే అసలు లారిసా బోనేసి, మన్నారా చోప్రా హీరోయిన్స్ ని సునీల్ రెడ్డి ఎందుకు పెట్టాడో అతనికే తెలియాలి. వీరు హీరోయిన్స్ గా అసలు పనికొస్తారా అని అనుకుంటారు ఈ సినిమాలో వాళ్ళను చూసినవారందరు. 'తిక్క' అనేది టైటిల్‌లోనే కాదు, ఇందులో నటించిన ఆర్టిస్టుల గెటప్పుల్లోనూ కనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్‌ని ఆడ, మగ కానట్టు వుండే ఓ గెటప్‌లో సెట్‌ చేస్తే, ఆలీకి లేని బట్టతలను బలవంతంగా పెట్టారు. ఇక పోలీస్‌ ఆఫీసర్‌ అయిన పోసాని పిచ్చి పిచ్చి డాన్సులు చేసి పిచ్చెక్కిస్తుంటాడు. తాగుబోతు రమేష్‌ కళ్ళను విచిత్రంగా పెట్టి భయపెడుతుంటాడు. ఇక ఈ సినిమాలో కె.వి.గుహన్‌ ఫోటోగ్రఫీ బాగుందనిపించింది. అసలు కథకే బలం లేకుండా కథనాన్ని కూడా అలానే చేసేసాడు డైరెక్టర్. పాటల పిక్చరైజేషన్‌ మాత్రం ఫర్వాలేదు అనిపిస్తుంది. థమన్‌ చేసిన ఒక రెండు పాటలు పర్వాలేదనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అంతంత మాత్రంగానే వుంది. హర్షవర్థన్‌, లక్ష్మీభూపాల్‌ రాసిన మాటలు అస్తవ్యస్తంగానే కాకుండా అసహనాన్ని కలిగించేవిగా కూడా వున్నాయి. అసలు డైరెక్టర్ ఏం చెప్పదల్చుకున్నాడో అనుకున్న కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని ఎలా ఎంటర్‌టైన్‌ చెయ్యాలనుకున్నాడు అనేది ఎంత ఆలోచించినా అర్థం కాదు. సాయిధరమ్‌తేజ్‌కి ఏం చెప్పి ఈ సినిమా ఓకే చేయించుకున్నాడు, ఈ కథలో ఏం నచ్చి తేజు ఒప్పుకున్నాడు అనేది కూడా మిస్టరీయే.

మూడు హిట్‌ సినిమాలు చేసిన హీరోని పెట్టుకొని, డబ్బుకు వెనకాడకుండా ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అయిన నిర్మాత అందుబాటులో వుండగా సునీల్‌రెడ్డి ఓ పిచ్చి కథను తీసుకొని అంతే పిచ్చిగా దాన్ని స్క్రీన్‌పైకి తీసుకొచ్చి జనం మీదకు వదిలాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు స్క్రీన్‌ మీద పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టారని ఆ రిచ్‌నెస్‌ చూస్తే అర్థమవుతుంది. సినిమా స్టార్ట్‌ అయిన పది నిముషాలకే ఇది డెఫినెట్‌గా తిక్క సినిమాయే అని ఆడియన్స్‌కి అర్థమైపోతుంది. ఇలాంటి అర్థం పర్థం లేని సినిమాని రెండు గంటల ఇరవై నిముషాలు చూసి భరించాలంటే మానవాతీత శక్తులున్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మానవ మాత్రులకు కాదు. ఫైనల్‌గా చెప్పాలంటే తిక్క అనే సినిమా చూసిన తర్వాత ఎంత చెత్త సినిమా చూసినా బాగుందే అనిపిస్తుంది. దీన్నిబట్టి తిక్క ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ, సెకండ్ హాఫ్ ఒకే

మైనస్ పాయింట్స్: డైరెక్టర్ సునీల్ రెడ్డి, పాటలు, హీరోయిన్స్, కథ, కథనం, పాటలు

Similar News