పోలీసులను కంగారు పెట్టిన కోతిపిల్ల.. ఇంతకీ ఏం చేసిందో చూడండి

ఫోన్ చేసి ఎవరూ మాట్లాడకపోయేసరికి ఎవరో ప్రమాదంలో ఉండి ఫోన్ చేసి ఉంటారు. మాట్లాడలేకపోవడంతో కాల్ కట్ అయిందని ..

Update: 2022-08-19 05:09 GMT

ఇంట్లో పిల్లలైనా, పెద్దలైనా ఒక్కోసారి చేసే చేష్టలను కోతి చేష్టలు అంటుంటారు. ఆ మాట ఊరికే రాలేదు. ఇలాంటి పనులు చేయబట్టే అలాంటి మాటలొస్తాయి మరి. ఓ కోతిపిల్ల చేసిన పనికి పోలీసులు పరుగులు పెట్టారు. ఇంతకీ ఏం చేసింది ఆ కోతిపిల్ల అనుకుంటున్నారా ? ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేసి అంతా ఆగమాగం చేసింది. అసలు మ్యాటర్లోకి వెళ్తే.. అమెరికాలోని ఎమర్జెన్సీ సర్వీసు 911కు ఫోన్ కాల్ వచ్చింది. పోలీసులు ఆ నంబర్ రిసీవ్ చేశారు కానీ.. అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాసేపటికి కాల్ కట్ అయింది.

ఫోన్ చేసి ఎవరూ మాట్లాడకపోయేసరికి ఎవరో ప్రమాదంలో ఉండి ఫోన్ చేసి ఉంటారు. మాట్లాడలేకపోవడంతో కాల్ కట్ అయిందని అనుకున్నారు పోలీసులు. వెంటనే కాల్ లొకేషన్ ట్రేస్ చేశారు. ఆ ఫోన్ కాల్ పాసో రోబుల్స్ ప్రాంతంలోని జూ లో నుంచి వచ్చినట్లు తెలిసింది. జూ లో ఏదైనా జంతువు ఎవరిపైనైనా దాడి చేసి ఉంటుందా ? అని కంగారుపడ్డారు. వెంటనే సాన్ లూస్ పోలీసు అధికారులు జూ వద్దకు ఆగమేఘాల మీద చేరుకున్నారు. లోపలికి వెళ్లి మొత్తం తిరిగి చూసిన ఎవరూ ఆపదలో ఉన్నట్లు కనిపించలేదు. ఆ నంబరుకు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. దాంతో మరింత టెన్షన్ పెరిగింది.
ఆఖరికి జూ సిబ్బంది సహాయంతో అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు. పుచిన్ జాతికి చెందిన రూట్ అనే కోతి పిల్ల ఆ ఫోన్ చేసినట్టు గుర్తించారు. జూ లో సామాగ్రిని అటూ ఇటూ తరలించేందుకు వినియోగించే బండి నుంచి ఆ కోతి పిల్ల ఫోన్ ను ఎత్తుకెళ్లిపోయిందని పోలీసులు గుర్తించారు. ఫోన్ ను ఎత్తికెళ్లిన కోతి పిల్ల.. దానిపై నంబర్లను నొక్కుతూ, నొక్కుతూ ఉండగా 911 కు కాల్ వచ్చినట్టు తేల్చారు. మెల్లగా 'రూట్' కోతిపిల్లను పట్టుకుని దాని నుంచి ఫోన్ తీసుకున్నారు. కోతిపిల్ల నుంచి ఫోన్ తీసుకోగానే అది పెట్టిన ఎక్స్ ప్రెషన్ కు తెగ నవ్వుకున్నారట. ఈ విషయాన్ని అమెరికా పోలీసులు ఫేస్ బుక్ లో షేర్ చేశారు.


Tags:    

Similar News