Budget : మము బ్రోవమని చెప్పమ్మా ...సీతమ్మ తల్లీ.. దయ చూపించవూ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో రెండు రోజుల్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు

Update: 2024-01-29 04:32 GMT

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో రెండు రోజుల్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ ప్రకటన ఉండనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు నిర్మలమ్మ ప్రకటించే వరాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ కావడంతో పెద్దయెత్తున ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు ఉండే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా నిర్మలమ్మ పద్దు ఉంటుందని అనేక మంది ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం మోదీ సర్కార్ బడ్జెట్ లో మ్యాజిక్ చేయడం ఖాయమన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

అన్ని వర్గాల వారినీ...
ప్రతి ఏటా ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో ఏదో ఒక ప్రాంతానికి లేదా కొన్ని వర్గాలకు మాత్రమే రాయితీలు అందేలా నిర్ణయాలు ఉంటాయి. ఆ యా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బట్టి నిర్ణయాలను తీసుకుంటారు. అక్కడ ఎక్కువగా ఉన్న సమస్యలపై మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. కానీ ఈ బడ్జెట్ అలా కాదు. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల వారినీ ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అందరికీ గుడ్ న్యూస్ చెబుతారని భావిస్తారు. అనేక మంది ఎన్నికల బడ్జెట్ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రాయితీలు భారీగానే ఉంటాయన్న ప్రచారంతో చెవులు రిక్కించి ఎదురు చూస్తున్నారు. నిర్మలమ్మ చదువుతుంటే..ఎవరికి ప్రయోజనం దక్కుతుందన్న ఉత్కంఠ దేశమంతా నెలకొంది.
రాయితీలను ప్రకటించి...
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రాయితీలను ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. రైలు ప్రయాణంలో రాయితీని కూడా ప్రకటించే అవకాశముంది. అదే సమయంలో ఆదాయపు పన్ను మినహాయింపును కూడా మరింత పెంచే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుంది. దేశంలో అత్యధిక శాతం ఉన్న రైతాంగంపై కూడా వరాల జల్లు కురిసే అవకాశముందని చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలకు కూడా అనుకూలంగా ఈ బడ్జెట్ లో నిర్ణయాలు ఉండే అవకాశముందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కార్మికులకు కూడా ఈ బడ్జెట్ ద్వారా గుడ్ న్యూస్ చెబుతారంటున్నారు. మహిళలను ఆకట్టుకునేలా బడ్జెట్ ఉంటుందని కూడా తెలుస్తోంది.
పెట్రో, గ్యాస్ ధరలను...
మరోవైపు పెట్రోలు ధరలను తగ్గించేలా నిర్ణయం ఉండనుందని కూడా చెబుతున్నారు. అదే సమయంలో గ్యాస్ సిలిండర్ ధరలను మరింతగా తగ్గించేందుకు కూడా నిర్ణయాలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు నియంత్రించడానికి కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు. అలాగే వివిధ రకాల వస్తువులపై కూడా పన్ను తగ్గించడం వంటివి చేసి వాటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేలా నిర్ణయాలు ఉంటాయంటున్నారు. సిగిరెట్లు, ధనవంతులు ఉపయోగించేవి కాకుండా మధ్యతరగతి బడ్జెట్‌ను నిర్మలమ్మ ప్రవేశ పెడతారని అంటున్నారు. మరి నిర్మలమ్మ పద్దు ఎలా ఉంటుందో చూడాలి మరి.


Tags:    

Similar News