ఆరుసార్లు గెలిచినా పట్టించుకోని పార్టీ.. అందుకేనట

సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. ఆయనకు టిక్కెట్ నిరాకరించింది.

Update: 2023-10-15 04:34 GMT

సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టిక్కెట్ కేటాయించింది. నాగం జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూలు నుంచి సుదీర్ఘంగా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా దశాబ్దాల పాటు పనిచేశారు. తర్వాత బీజేపీలోకి వెళ్లి కాంగ్రెస్ లోకి వచ్చారు. అయితే నాగం జనార్థన్ రెడ్డికి ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడం మహబూబ్ నగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది.

2014 నుంచి...
దశాబ్దకాలం పాటు నాగం జనార్థన్ రెడ్డి అసెంబ్లీ గడప తొక్కలేకపోయారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక వెలుగు వెలిగిన నేత దశాబ్దకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సొంత పార్టీ పెట్టినా ఫలితం లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు పార్టీలు మారినా ప్రయోజనం లేదు. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ 2014 నుంచి ఆయనకు అక్కడ విజయం లభించలేదు. దీంతో ఆయన ఈసారి పెట్టుకున్న హోప్స్ కూడా వర్క్ అవుట్ కాలేదు. కాంగ్రెస్ టిక్కెట్ నిరాకరించింది.
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా...
పదేళ్ల క్రితం... 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన చివరిసారి గెలిచారు. 1994 నుంచి 2012లో జరిగిన ఉప ఎన్నికల వరకూ ఆరు సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి గెలుపొందిన నాగం జనార్థన్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. అది నడపలేని నాగం చివరకు బీజేపీలో చేరిపోయారు. కానీ బీజేపీలో ఎక్కువ కాలం ఉండలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ దక్కలేదు.
పోటీకి దిగే ఛాన్స్...
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కొంత నాగంకు ప్రయారిటీ లభిస్తుందని భావించారు. తెలుగుదేశంలో ఉన్న అనుబంధంతో ఆయనకు సీటు ఇప్పిస్తారని అనుకున్నారు. ఇదే తనకు చివరి అవకాశమని నాగం గత కొన్నాళ్లుగా చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం సర్వేలను చూసి మాత్రమే టిక్కెట్లు కేటాయించింది. అందుకే ఆయన సీటును కేటాయించ లేదంటున్నారు. అయితే నాగం ఊరికే ఉండే వ్యక్తి కాదు. ఖచ్చితంగా పోటీకి దిగుతారన్నది వాస్తవం. అయితే ఏ పార్టీ నుంచి అన్నది నాలుగైదు రోజుల్లో తేలనుంది.
Tags:    

Similar News