KCR : కర్ణాటక వ్యూహానికి కన్నడ తరహాలోనే చెక్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఎన్నికల క్షేత్రాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట

Update: 2023-10-27 14:06 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఎన్నికల క్షేత్రాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన చేజార్చుకోరు. మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగురేయాలని, ప్రగతి భవన్ లోనే ఉండి పోవాలని కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తుంటారు. అందుకు ఎదుటి వారు చిత్తయ్యేంతటి తరహాలో ఆయన ఆలోచనలు సాగుతుంటాయి. తెలంగాణలో మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ కనపడుతుండటంతో కేసీఆర్ తన దైన శైలితో ముందుకు వెళుతున్నారు.

ఆరు గ్యారంటీలతో...
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళుతుంది. కర్ణాటక తరహాలోనే తాము అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతోంది. రాహుల్, ప్రియాంకలు కూడా తెలంగాణ వచ్చి సభల్లో పాల్గొన్నారు. వారి సభలకు పెద్దయెత్తున జనం రావడం కూడా గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపుతుంది. అధికార పార్టీలో అందరూ సిట్టింగ్ లే కావడంతో సహజంగా ఉండే వ్యతిరేకతపై కొంత ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అందుకే రోజుకూ మూడు సభలు నిర్వహిస్తూ ప్రజలను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగ సభల్లోనూ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు.
అక్కడి రైతుల చేత...
అంతటితో ఆయన ఆలోచనలు ఆగలేదు. కర్ణాటకలో ఆ పార్టీ అమలు చేస్తున్న పథకాలపై అక్కడి రైతులతోనే చెప్పించాలని నిర్ణయించారు. కర్ణాటకలో 200 యూనిట్ల వరకూ ఉచితం అని ప్రకటించడంతో అక్కడ విద్యుత్తు కోతలను ఎక్కువగా అమలు చేస్తున్నారని, తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. వారిచేతనే తెలంగాణ రైతులకు చెప్పే విధంగా ప్లాన్ చేశారు. కర్ణాటక రైతులను తెలంగాణకు రప్పించి ప్రత్యేకంగా ప్రచారం చేపట్టారు. ఇది రైతులతో పాటు పారిశ్రామిక వర్గాలను, వ్యాపార వర్గాలను ఆకట్టుకుంటుందన్న అంచనాలో గులాబీ బాస్ ఉన్నారు. కర్ణాటక రైతులు తెలుగులో బోర్డులు పట్టుకుని తెలంగాణలో ప్రచారం చేస్తుండటం ఇందుకు నిదర్శనం.
హామీల అమలు....
కేవలం విద్యుత్తు కోతలు మాత్రమే కాదు ఆర్టీసీ ఛార్జీలు పెరుగుదల, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం వల్ల ప్రయాణ ఛార్జీలు పెరుగుతాయని, పురుషులకు అందులో సీట్లు లేకుండా పోయాయని, ఛార్జీలు కూడా పెరిగే అవకాశముందని ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను కర్ణాటక ప్రభుత్వంలో అమలు చేయకుండా దొడ్డిదారిన ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్న ఆరోపణ కూడా రైతుల నుంచి చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ కర్ణాటక వ్యూహనికి కన్నడ రైతులతోనే చెక్ పెట్టేందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ఫలితాన్నిస్తుందన్నది డిసెంబరు 3వ తేదీకి గాని తేలదు. అప్పటి వరకూ చూస్తుండాల్సిందే.


Tags:    

Similar News