Dharmapuri Aravind : ఆ ఇంటి పేరు ఈసారి కూడా కలసొస్తుందంటారా
ధర్మపురి అరవింద్ ను రానున్న శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది
ధర్మపురి అరవింద్ గత పార్లమెంటు ఎన్నికల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన మాజీ పీసీపీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటికీ గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాడు అరవింద్ పేరు మారుమోగిపోయింది. డీఎస్ కుటుంబంలో రాటు దేలిన రాజకీయ నేతగా ఎదురుగుతున్న ధర్మపురి అరవింద్ మరోసారి కూడా అదే ఇంటి పేరు ఉన్న కల్వకుంట్ల కుటుంబంతోనే శాసనసభ ఎన్నికల్లో ఢీకొంటున్నారు. ఈసారి మరోసారి సంచలనం సృష్టిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఈసారి శాసనసభకు...
ధర్మపురి అరవింద్ ను రానున్న శాసనసభ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. తొలి జాబితాలోనే ఆయన పేరును ప్రకటించింది. దీంతో కోరుట్ల నియోజకవర్గం నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్న కోరుట్ల నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి అక్కడ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వరసగా నాలుగుసార్లు విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలోనూ ఆయన గులాబీ జెండా గుర్తుపై వెలుగొందారు. అంటే కోరుట్ల కారు పార్టీకి స్ట్రాంగ్ అని గణాంకాలు కూడా చెప్పకనే చెబుతున్నాయి.
అభ్యర్థిని మార్చినా...
ఈసారి మాత్రం కోరుట్లలో అభ్యర్థిని బీఆర్ఎస మార్చింది. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కోరిక మేరకు ఆయన కుమారుడు డాక్టర్ సంజయ్ కు ఈసారి టిక్కెట్‌ను కేసీఆర్ కేటాయించారు. దీంతో కల్వకుంట్ల కుటుంబంతో ధర్మపురి అరవింద్ మరోసారి తలపడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంటులోనే ఈ నియోజకవర్గం ఉంది. అంతేకాదు అరవింద్ పూర్వీకులది కూడా కోరుట్ల కావడంతో ఆయనను ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది. బలమైన బంధుత్వాలు కూడా ఉన్నాయి. మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో బీసీ ఓటు బ్యాంకు తనకు అనుకూలంగా మారుతుందన్న అంచనాల్లో అరవింద్ ఉన్నారు.
గెలిచే ప్రయత్నం...
బీఆర్ఎస్ అభ్యర్థి మారినప్పటికీ ఆ కుటుంబమే దాదాపు దశాబ్దన్నర కాలంగా కోరుట్లకు ప్రాతినిధ్యం వహించడంతో కొంత అసంతృప్తి, వ్యతిరరేకత ఉంటుందన్న అంచనాలో బీజేపీ నేతలున్నారు. అందుకే ఏరికోరి ధర్మపురి అరవింద్ ను కోరుట్ల నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి గెలిస్తే మరోసారి కల్వకుంట్ల కుటుంబంపైన అరవింద్ పై చేయి సాధించినట్లే అవుతుంది. గులాబీ జెండా అడ్డాలో ఉన్న కోరుట్లలో కమలం జెండా ఎగరడానికి అరవింద్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలతో పాటు తన బంధువులతో సమావేశమవుతూ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ధర్మపురి అరవింద్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. డిసెంబరు 3వ తేదీన దీనిపై స్పష్టత రానుంది.