తీగలు దొరికాయ్.. డొంకలు కదులుతాయ్

Update: 2016-12-14 10:07 GMT

తీగలు చాలా సింపుల్ గానే దొరికాయి. వాటిని పట్టుకుని సర్కారు వారు లాగడం మొదలు పెట్టారు. ఇక డొంకలు కదలవలసి ఉంది. కేవలం కదలడం మాత్రమే కాదు... డొంకల్లో భూకంపం పుట్టినా కూడా ఆశ్చర్యం లేదు. నల్ల కుబేరుల అంతు తేల్చే విషయంలో చాల కృత నిశ్చయంతో ముందుకు కదులుతున్న మోడీ సర్కారు... ఈ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో అక్రమ నగదు మార్పిడి లావాదేవీలు జరిగాయో లెక్క తేల్చారు. వాటిని ఆధారంగా చేసుకుని, అసలు భారీ మొత్తాల్లో నగదు మార్పిడి అరాచకాలకు పాల్పడిన పెద్ద నల్ల కుబేరులు ఎవరో సమాచారం సేకరించనున్నారు. ఆ తరువాత అసలు వ్యవహారం మొదలవుతుంది.

ప్రతిరోజూ... కనీసంగా రెండేసి వేల రూపాయలు తీసుకోవడానికి తాము నానా యాతన పడుతుండగా ఐటీ అధికారులకు దొరుకుతున్న వారి వద్ద.. కోట్లకు కోట్ల కొత్త నోట్లు ఎక్కడినుంచి వచ్చాయోనని సామాన్యుడు నివ్వెరపోతున్నాడు. అలాంటి నేపథ్యంలో నల్ల కుబేరులు బ్యాంకుల్లో అక్రమాలకు పాల్పడి సొమ్ము పొందినట్లుగా నిగ్గు తేల్చారు. నల్ల కుబేరులు దొరక్కపోయినా... అక్రమ లావాదేవీలు జరిగిన బ్యాంకుల వ్యవహారం అధికారులకు అనువుగా దొరికింది. అక్కడినుంచి మొదలు పెట్టి, అసలు అక్రమాలకు పాల్పడిన వారు ఎందరో, ఎంత మొత్తం గోల్ మాల్ చేశారో సమస్తం రాబట్టనున్నారు.

64 బ్యాంకుల్లో అక్రమాలు జరిగినట్లుగా అధికారులు విచారణ సాగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విచారణ పర్యవసానాలు చాల సీరియస్ గా ఉండబోతున్నాయనేది విశ్లేషకుల అంచనా. ఈ విచారణలో అనూహ్యమైన చాలా సంగతులు బయటకు వస్తాయని భావిస్తున్నారు. మరి ప్రస్తుతానికి చిన్న చేపలు బుట్టలో పడ్డట్టే.... పెద్ద చేపలు ఎప్పటికి దొరుకుతాయో చూడాలి.

Similar News