శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ సుఖాంతం

Update: 2017-07-21 03:37 GMT

ఓలా క్యాబ్‌లో కిడ్నాప్‌ అయిన వైద్యుడు శ్రీకాంత్‌ను పోలీసులు సురక్షితంగా విడిపించగలిగారు. జులై 6న మెట్రో స్టేషన్‌ నుంచి వెళ్లేందుకు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న శ్రీకాంత్‌ను డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడు. తప్పుడు ధృవపత్రాలతో ఓలాలో ఉద్యోగం సంపాదించిన సుశీల్‌ అనే వ్యక్తి ఓలాను బెదిరించి 5కోట్లు వసూలు చేయాలని భావించాడు. దాదాపు 15రోజుల దర్యాప్తు తర్వాత యూపీలోని మీరట్‌ సమీపంలోని శతాబ్దినగర్‌లో శ్రీకాంత్‌ను బంధించిన ఇంటిపై పోలీసులు దాడి చేసి విడిపించారు. ఆరున శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన తర్వాత దాద్రి., మీరట్‌., ముజఫర్‌నగర్‌., హరిద్వార్‌లలో తిప్పారు. ఆరవ తేదీ రాత్రి 11.30కు క్యాబ్‌ బుక్‌ చేసుకున్న శ్రీకాంత్‌ ఒంటరిగా ఉండటంతో అతడిని బంధించారు. శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన తర్వాత అతడిని బంధించడంలో నేపాల్‌., సోన్‌వీర్‌., అమిత్‌., ప్రమోద్‌లు సహకరించారు. ప్రధాన నిందితుడు సుశీల్‌తో పాటు అనూజ్‌ పరారీలో ఉన్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో ఎదురు కాల్పులకు దిగడంతో ప్రమోద్‌ గాయపడ్డాడు. నిందితులు తమ సెల్‌ లొకేషన్‌ దొరక్కడం జాగ్రత్త పడ్డారు. పుణ్యక్షేత్రాల్లో భక్తుల్లా నటించేవారు. శ్రీకాంత్‌ ఆధార్‌ లో పుట్టిన రోజు చూసి జులై 10న అతనికి ఓ కళ్లజోడు బహుకరించారు. ఆ రోజు మద్యం సేవిద్దామని కోరినా శ్రీకాంత్‌ నిరాకరించడంతో అతనికి బహుమతి ఇచ్చారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌ చేసిన సమయంలో వారు తనను హింసించలేదని చేతిపై చిన్న గాయం చేసి వీడియో పంపి భయపెట్టారని శ్రీకాంత్ చెప్పారు. ఇక జీవితంలో ఎప్పుడు క్యాబ్‌ ఎక్కనని., తనను విడిపించేందుకు ఓలా సంస్థ చేసిన సాయాన్ని మర్చిపోలేనని చెప్పారు. శ్రీకాంత్‌ విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి చేసిన మంత్రి బండారు దత్తాత్రయకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News