వాతావరణం, ఏర్పాట్లు అంతా యుద్ధ సూచికలే

Update: 2016-09-29 12:00 GMT

పశ్చిమ ఆర్మీకి భారత ప్రభుత్వం సెలవులను రద్దుచేసింది. సెలవులపై దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉన్న సైనికులందరూ తిరిగి తమ తమ నెలవులకు చేరుకోవాలి.

పంజాబ్ పఠాన్ కోట్ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ క్షణంలో పెద్ద సంఖ్యలో క్షతగాత్రులను తీసుకువచ్చినా సరే.. అవసరమైన చికిత్సలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పాకిస్తాన్ తో ఉండే వాఘా సరిహద్దులో దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం బీటింగ్ రిట్రీట్ కు భారత సైన్యం విరామం ప్రకటించింది. తాజాగా దీన్ని తాత్కాలికంగా ఆపివేశారు.

తమ మీద అదనపు ఆరోపణలు, నిందలు వేయకుండా ఉండేందుకు బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత నిర్వహించిన దాడులు , ఉగ్రవాద స్థావరాల విధ్వంసానికి సంబంధించిన ద్రుశ్యాలను భారత సైన్యం పక్కాగా చిత్రీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అఖిలపక్ష సమావేశంలో దాదాపుగా దేశంలోని అన్ని పార్టీలు పాకిస్తాన్ తో అనుసరిస్తున్న వైఖరి విషయంలో మోదీ సర్కారు వెన్నంటి ఉండడానికి నిర్ణయించాయి. ఈ మేరకు మద్దతు ప్రకటించి, సైన్యాన్ని ప్రత్యేకంగా అభినందించాయి.

... ఈ అన్ని పరిణామాల సంకేతాలు ఏం స్ఫురింపజేస్తున్నాయి. అచ్చంగా భారత్ కు పాకిస్తాన్ తో యుద్ధం రాబోతున్నదనే అనిపిస్తోంది. యుద్ధం జరుగుతుండగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగానే సైన్యం దీనికి సన్నద్ధం అవుతోంది.

Similar News