లండన్‌లో అవార్డు అందుకున్న చంద్రబాబు సతీమణి

Update: 2016-10-20 00:33 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి కార్పొరేట్ రంగంలో ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్న గోల్డెన్ పీకాక్ అవార్డును అందుకున్నారు. కార్పొరేట్ గవర్నెన్ప్‌లో అద్భుతమైన పనితీరు కనబరచినందుకు, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఈ పురస్కారానికి ఎంపికైంది. సంస్థ వైస్ ఛైర్మన్‌గా ఆమె లండన్ వెళ్లి అవార్డును అందుకున్నారు. వినియోగదారులకు మంచి సేవలు అందించడంలో హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, ఇందుకు సహకరిస్తున్న సిబ్బంది అందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు.

నారా భువనేశ్వరి హెరిటేజ్ సంస్థ తరఫున గోల్డెన్ పీకాక్ అవార్డు లండన్ లో అందుకున్న సంగతి.. నిజానికి.. సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేయడానికంటె ముందే ప్రపంచానికి తెలిసింది. తమ కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించిన నారా లోకేష్ ఆ ప్రసంగంలో, ముందు రోజు రాత్రే లండన్ లో జరిగిన కార్యక్రమంలో ‘మా అమ్మ అవార్డు అందుకున్నారు’ అనే సంగతి బయటపెట్టారు. తమ కుటుంబానికి సరిపడా లాభాలను హెరిటేజ్ సంస్థ అందిస్తున్నదని.. ఆ సంస్థ ద్వారానే తామంతా బతికిపోతున్నాం అని లోకేష్ ఆ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.

ఒకవైపు నారా చంద్రబాబునాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతివైపు పరుగులెత్తించడానికి అహర్నిశలూ కష్టపడుతోంటే.. హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని తొలినుంచి అన్నీ తానై నడిపిస్తున్న భువనేశ్వరి అంతర్జాతీయ అవార్డులు సాధించే స్థాయికి సంస్థను తీసుకువెళుతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News