రెండు రోజుల్లో పందెం కోడిపై క్లారిటీ

Update: 2017-01-03 11:10 GMT

కోడిపందేలు నిర్వహించడానికి వీల్లేదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పందెంరాయుళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు కోడిపందేల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోడిపందేలను సంప్రదాయ క్రీడగా పరిగణించాలని పిటిషనర్ కోరారు. కత్తులు కట్టకుండా కోడిపందేల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ కోరారు. కోడిపందేలు నిర్వహించకుండా ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకున్న కోళ్లను వెంటనే పెంపకందారులకు అప్పగించాలని రాజు పిటిషన్ లో కోరారు. అయితే ఈ కేసు రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

 

స్టేషన్ల నిండా కోళ్లే......

ఇదిలా ఉండగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులు పందెంకోళ్లను అదుపులోకి తీసుకుంటున్నారు. పందెం రాయుళ్లపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు...కోళ్లను మాత్రం తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 500 కోళ్లను కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే న్యాయస్థానం మాత్రం వీటిని వేలం వేయాలని పేర్కొంది. తూర్పు, పశ్చిమ గోదావరి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఇప్పడు నిందితులకన్నా....పందెం కోళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. అదుపులోకి తీసుకున్న పోలీసులు వాటిని కట్టడి చేయలేక అవస్థలు పడుతున్నారు. వాటికి సకాలంలో ఆహారాన్ని, నీటిని అందించడం వారికి కష్టమైపోతోంది. పందెంరాయుళ్లు మాత్రం పందెంకోళ్లను అలా కట్టివేసి ఉంచి.....ఆహారాన్ని అందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. దీనిపై పశ్చి మ గోదావరి జిల్లా పార్లమెంటు సభ్యుడికి కూడా వారు ఫిర్యాదు చేశారు.

Similar News