రాములమ్మ రూటే...సపరేటు...

Update: 2016-12-17 13:47 GMT

విజయశాంతి. ఈపేరు రెండున్నరేళ్ల క్రితం వరకూ మీడియాలో...జనాల నోళ్లలో విపరీతంగా హల్ చల్ చేసింది. పార్లమెంటు సభ్యురాలిగా... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెల్లెలుగా రాములమ్మ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. కాని రెండున్నరేళ్ల నుంచి విజయశాంతి కన్పించడం లేదు. మీడియా ఎదుటకే రావడం లేదు. ప్రజా సమస్యలపై కూడా పెదవి విప్పడం లేదు. అలాంటి రాములమ్మ ఇప్పుడు హటాత్తుగా చెన్నైలో ప్రత్యక్షమైంది. జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించింది. శశికళను ఓదార్చి మద్దతును ప్రకటించింది. అన్నాడీఎంకేను ముందుండి నడపాలని రాములమ్మ శశికలకు సలహా కూడా ఇచ్చేసింది.

ఎన్నోఏళ్ల తర్వాత...

విజయశాంతికి పదవిలో ఉంటే తప్ప ప్రజాసేవ గుర్తుకు రాదని ఎప్పటి నుంచో విమర్శ ఉంది. ఆమె తొలుత బీజేపీలో చేరారు. అక్కడ నుంచి గులాబీ గూటికి చేరుకున్నారు. టీఆర్ఎస్ లో కేసీఆర్ విజయశాంతికి మంచి గుర్తింపే ఇచ్చారు. మెదక్ ఎంపీగా నిలబెట్టి మరీ గెలిపించారు. రాఖీ పండగ రోజు స్వయంగా కేసీఆర్ ఆమె ఇంటికి వెళ్లి మరీ రాఖీ కట్టారు. అలాంటి విజయశాంతి రాజకీయ జీవితంలో రాష్ట్రం ఏర్పడక ముందే కష్టాలొచ్చిపడ్డాయి. గులాబీ అధినేత మనస్సు కష్టపెట్టడంతో విజయశాంతిని కేసీఆర్ క్రమంగా దూరం పెడుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంతో వెంటనే విజయశాంతి ఢిల్లీ వెళ్లి మరీ సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. ఆ తర్వాత నుంచి విజయశాంతి కన్పించడమే మానేసింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అనేది ఆ పార్టీ వారికే కాదు రాములమ్మకు కూడా తెలిసినట్లు లేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ చెన్నైలో ప్రత్యక్షం కావడంతో విజయశాంతి మళ్లీ మీడియాలోకెక్కారు. తమిళనాడంతా శశికళను తిట్టుకుంటూ ఉంటే అక్కడికెళ్లి శశికళకు మద్దతిచ్చింది విజయశాంతి. విజయశాంతి రూటే ...సపరేటు కదూ...

Similar News