యువరాజుకు మళ్లీ కోపమొచ్చింది

Update: 2016-12-14 12:00 GMT

తను మాట్లాడితే భూకంపం వస్తుందని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి దేశం దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ కి మళ్ళీ కోపమొచ్చింది. తను ఎక్కడ సభలో మాట్లాడతానో అని ప్రధాని మోడీ బెదిరిపోతున్నారని అన్నంత రేంజ్ లో రాహుల్ గాంధీ బుధవారం నాడు విరుచుకు పడ్డారు. సభలో ఆయనకు మాట్లాడే అవకాశం రాకుండా.. సభ వాయిదా పడిన వెంటనే.. ఆయనలో ఆవేశం తన్నుకొచ్చేసింది. బయట మీడియా ముందు నిప్పులు చెరిగారు.

నిజానిజాల సంగతి పరమాత్ముడికే ఎరుక..! కానీ, రాహుల్ గాంధీ ఒక బాంబు లాంటి విషయం చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన ఒక సీక్రెట్ తనకు తెలుసునని, తను ఆ విషయం సభలోనే చెప్పాలని అనుకుంటున్నానని రాహుల్ అంటున్నారు. సభలో చెప్పినట్లయితే అది రికార్డుల్లోకి వెళుతుందనేది ఆయన ఉద్దేశం కావచ్చు. దానివల్ల ప్రధాని మోడీని మరింత ఎక్కువ ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని అయన ఆశ పడుతున్నట్లుంది. నిజమే కావొచ్చు గానీ, అసలంటూ చెప్పకుండా ఆ అవినీతి బాగోతాన్ని రాహుల్ తన మదిలోనే దాచి పెట్టుకుంటే.. ఇంకా చాలా పెద్ద నష్టం జరుగుతుందని ఆయన ఎందుకు గుర్తించడం లేదు.

తను చెప్పబోయే అవినీతి విషయానికి మోడీనే స్వయంగా సమాధానం చెప్పవలసి ఉంటుందని రాహుల్ అంటున్నారు. ప్రధాని వ్యక్తిగత అవినీతి కి సంబంధించి అంత గొప్ప సీరియస్ విషయం రాహుల్ వద్ద ఉంటే... సభ ముందు కుదరనప్పుడు ప్రజల ముందు పెట్టవచ్చు కదా... ప్రజలు ఎంచక్కా మోదీని ఇంటికి పంపిస్తారు కదా.. అని సామాన్యులు అనుకుంటున్నారు. ఇంత చిన్న లాజిక్ రాహుల్ కు ఎందుకు స్ఫురించలేదో మరి.

Similar News