యువరాజు పిలుపు : బ్యాంకుల వద్ద కాంగ్రెస్ చలివేంద్రాలు

Update: 2016-11-13 05:40 GMT

దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ప్రధానంగా బ్యాంకులవద్ద పెద్దనోట్లు మార్చుకోవడానికి క్యూలలో నిల్చుని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సేవ చేయాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బ్యాంకులు ఏటీఎం లు మరియు పోస్టాఫీసుల వద్దకు వెళ్లి అక్కడ డబ్బు మార్పిడి కోసం క్యూలైన్లలో నిల్చుని నానా పాట్లు పడుతున్న ప్రజలకు పార్టీ వారు వీలైనంత సేవలు అందించాలని ఆయన కోరుతున్నారు. మొత్తానికి ఒక రోజు తాను స్వయంగా వెళ్లి క్యూలైన్ లో నిల్చునే సరికి జనం పడుతున్న కష్టాలు ఏమిటో యువరాజుకు తెలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

రాహుల్ గాంధీ రెండు రోజుల కిందట నగదు మార్పిడికోసం ఢిల్లీ పార్లమెంటు స్ట్రీట్లోని బ్యాంకుకు వెళ్లి అక్కడి జనంతో పాటూ క్యూలైన్ లో గంటల తరబడి నిల్చుని నగదు మార్చుకున్న సంగతి తెలిసిందే. జనం పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికే తాను స్వయంగా బ్యాంకుకు వచ్చానని, ప్రధాని మోదీకి జనం గురించి, సామాన్యులు పడుతున్న కష్టాల గురించి తెలియదని రాహుల్ గాంధీ బ్యాంకు ఎపిసోడ్ అనంతరం వ్యాఖ్యానించారు.

తన చర్య ద్వారా మోదీ మీద విమర్శకు వాడుకోవడం అక్కడితో అయిపోలేదు. క్యూలైన్లలో ఉండే సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు దేశంలో ప్రతిచోటా వారికి సేవలు అందించాలని రాహుల్ పిలుపు ఇచ్చారు. ఇంతకూ క్యూలైన్ లో వారికి సహకారం అంటే రాహుల్ ఉద్దేశం ఏమిటో తెలియడం లేదు. ఆలయాల్లో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు సాయం చేసినట్లుగా తాగునీటి ప్యాకెట్లు పులి హోర పొట్లాలు ఇస్తారా లేదా.. నగదు మార్చుకోవడంలో సలహాలు ఇస్తారా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం కోసం చలివేంద్రాలు ఏర్పాటుచేస్తారా? కాంగ్రెస్ నాయకులు ఎలాంటి సాయం చేస్తారు? అని జనం ఆశ్చర్యంగా ఎదురుచూస్తున్నారు.

Similar News