యువతకి  ఇవ్వడం కాదు...వెతుక్కోవాలేమో

Update: 2016-12-11 04:34 GMT

తెలుగు రాష్ట్రం విడిపోయాక తెలుగు తమ్ముళ్ళు కొందరు సైకిల్ వదిలి కారులోకి ఎక్కారు. ఇక హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసి దిమ్మతిరిగి ఇక సైకిల్ తొక్కడం కష్టమని భావించి చాలామంది తెలుగు తమ్ముళ్ళు,అనయ్యలు కారులోకి జంప్ చేశారు. ఇక టిడిపిలో సీనియర్ నాయకులు ఎక్కడ వున్నారు?

తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్‌.రమణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సగం టికెట్లు యువతకే కేటాయిస్తామని ప్రకటించారు.

అక్కడికి తామేదో యువతరానికి గొప్ప ఆఫర్ ఇచ్చేస్తున్నట్లుగా ఈ డైలాగు ద్వారా ఎల్.రమణ్ ఒక బిల్డప్ ఇస్తున్నారు గానీ.. నిజం చెప్పాలంటే పార్టీలో అసలు సీనియర్లు ఎవరూ మిగల్లేదు... తెలంగాణ తెలుగుదేశానికి సీనియర్లకు టికెట్లు ఇవ్వాలంటే అసలు నేతల కరవు.. సీనియర్లు అందరూ వుండి వుంటే టికెట్టు ఎవరికి ఇవ్వాలో అని తలబద్దలు కొట్టుకునే వారు. అలకలు, బుజ్జగింపులు ఒకవేళ సీనియర్ నాయకుడికి అనుకున్న టికెట్ రాకపోతే వేరే తాయిలం ఇవ్వడం లాంటివన్నీ పాపం ఈసారి వుండవు.

అందుకే కొత్త నెత్తురు పేరిట యువకులకు ఇవ్వాల్సిందే.. వేరే గత్యంతరం లేదు. వారిలోనైనా సమర్ధులు దొరుకుతారా అన్నది అనుమానమే. లోగుట్టు ఇలా వుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సగం టికెట్లు యువతకే కేటాయిస్తామని ప్రకటించి, తామేదో యువతరాన్ని ఉద్ధరించేస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ‘ఈ విధంగా మనం ముందుకు వేళదాం’ అని తరుచుగా చెప్పే వారి నాయకుడు ఈ సారి ఏ విధంగా ముందుకు వెళ్ళతారో చూడాలి మరి.

Similar News