మెట్రో : పనులపై తప్ప పరుగుపై శ్రద్ధ లేదా?

Update: 2016-12-01 02:23 GMT

‘మెట్రో పనులు మొదలైన తర్వాత హైదరాబాదు నగరంలో ప్రధానంగా నిత్యం టూవీలర్లలో రోడ్ల మీద తిరిగే వారిలో చాలా మంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడడం జరుగుతోంది. చాలా మందిలో టీబీ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి’ అనేది ఆ రంగానికి సంబంధించిన వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఇందులో అణువంతైనా అసత్యం లేదు. హైదరాబాదు నగరంలో మెట్రో రైల్ పనులు ప్రారంభమైన తర్వాత.. ప్రజారోగ్యం దారుణాతి దారుణంగా దెబ్బతింటున్నదనడంలో సందేహం లేదు. ఆరోగ్యం సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజులు నిరంతరాయంగా వర్షం కురిస్తే.. హైదరాబాదులో జనజీవితం, రోడ్లు ఎంతగా సర్వనాశనం అవుతాయో.. మెట్రో పనులు జరుగుతున్న చోట్ల రోడ్లు సర్వనాశనం కావడం అనేది ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో స్పష్టంగా కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొత్త అధికార నివాసం ప్రగతి భవన్ నుంచి చేపట్టిన సమీక్షను గమనిస్తే.. మరో రెండేళ్ల వరకు నగర జీవులకు మెట్రో నరకం తప్పదని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా 2018 ఆగస్టులోగా పనులు పూర్తి చేయమంటూ వారికి డెడ్ లైన్ నిర్ణయించడమే ఇందుకు నిదర్శనం.

అయితే ముఖ్యమంత్రి పనులు వేగంగా చేయాలి, పనులు ఎలా సాగాలి అనే విషయాలను సమీక్షిస్తుండడం మంచిదే. పనులు వేగంగా కావాలని పురమాయించడమూ మంచిదే. అయితే అదే సమయంలో పనులు పూర్తయిన రీచ్ లలో మెట్రో పరుగులను సత్వరం ప్రారంభించాల్సిన అవసరం కూడా ఉంది. పోయిన ఏడాది ఉగాది నాటికే మెట్రో పరుగులు పెడుతుందని అప్పట్లో ప్రకటించారు. ఆ గడువుకు కాకపోయినా.. తర్వాత కొన్నాళ్లకు రెండు రీచ్ లలో పనులు పూర్తయ్యాయి. నాగోలు-మెట్టుగూడ, మియాపూర్-ఎస్సార్ నగర్ మార్గాలు ఎప్పుడో పూర్తయిపోయాయి. వీటిని సత్వరం ప్రారంభించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఆల్రెడీ ఈ మార్గాల్లో ట్రయల్ రన్ మెట్రో నడుస్తోంది. ఈ మార్గాల్లోని ఉప్పల్ ప్రాంతంలో గానీ, ప్రత్యేకించి కూకట్ పల్లి ప్రాంతంలో గానీ రద్దీ సమయాల్లో ట్రాఫిక్ లో వాహనదారులకు నరకం కనిపిస్తుంటుంది. ఈ మెట్రో రైల్ లను ప్రారంభిస్తే.. ఆ ఇక్కట్లు కాస్త తప్పించినట్లు అవుతుంది.

పైగా రెండు మార్గాలను తక్షణం ప్రారంభించడం వలన మరో ఉపయోగం కూడా ఉంది. ఆచరణలో ఏవైనా చిన్న చిన్న లోపాలు బయటపడితే.. మిగిలి ఉన్న మెట్రో పనుల్లో వాటిని సరిదిద్దవచ్చు కూడా. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కనీసం కొత్త సంవత్సరంలో సంక్రాంతి నాటికైనా మెట్రోరైలు రెండు మార్గాలను పరుగులు పెట్టిస్తే.. ప్రతిరోజూ ట్రాఫిక్ కష్టాలు పడుతున్న ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. కేసీఆర్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News