ముందే చెప్పిన తెలుగుపోస్ట్ : పెరిగిన హుండీ కలెక్షన్లు

Update: 2016-11-19 21:44 GMT

ఒక ప్రభుత్వ నిర్ణయం వచ్చినప్పుడు కొన్ని పర్యవసానాలను సులువుగా ఊహించడం జరుగుతుంది. ఆ క్రమంలో.. 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వెంటనే.. ఆ మరురోజు అందించిన ప్రత్యేక కథనాల్లో తెలుగుపోస్ట్ ఓ విశ్లేషణ చేసింది. నోట్ల రద్దు ఎఫెక్టుతో దేశవ్యాప్తంగా ఉండే పెద్దా చిన్నా ఆలయాలు అన్నింటిలోనూ హుండీలు నిండిపోతాయని ఊహించింది. చాలా మంది నల్లకుబేరులు డబ్బు ను మార్చుకునే అవకాశం ఉండక, కనీసం ఇతర ప్రాంతాలకు తరలించే వెసులుబాటుకూడా ఉండక, స్థానికంగా గ్రామాల్లో ఉండే చిన్న చిన్న ఆలయాల్లోని హుండీల్లో కూడా చాలా అనూహ్యమైన పెద్ద మొత్తాల్లో నగదు వేసేస్తారని ఊహించింది.

రెండు రోజుల తర్వాత.. దేశంలో పలు చోట్ల నగదును మురికి కాలువల్లో పారేస్తున్నట్లు, తగుల బెట్టేస్తున్నట్లు కొన్ని వార్తలు రావడంతో.. నగదును కాల్చేయొద్దు, కనీసం హుండీల్లో వేయండి.. అంతిమంగా అవి ఏదో రకమైన ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగపడే అవకాశం ఉంది .. అంటూ మరో కథనాన్ని కూడా తెలుగుపోస్ట్ అందించింది.

తీరా ఇప్పుడు దేశంలో పలు ప్రాంతాల నుంచి వస్తున్న వార్తా కథనాలను గమనిస్తే ఈ ఊహలు నిజమైన పరిస్థితి కనిపిస్తోంది. అచ్చంగా దేశంలో ప్రతిచోటా ఆలయాల్లో హుండీలు నిండిపోతున్నాయని, అంతా రద్దయిన నోట్లే వెల్లువలా వచ్చిపడుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బు తీసుకు వచ్చి దేవుడికి సమర్పించుకుంటున్నారు. తమ మిగిలిన సొమ్మును కాపాడాల్సిందిగా వేడుకుంటున్నారు. అయినా అప్పుడే ఇంకా లెక్క తేలేది కూడా కాదని.. డిసెంబరు 31 లోగా ఇంకా ఏమైనా లూప్ హోల్స్ దొరుకుతాయేమో చూసేవారు చాలా మంది ఉన్నారని, గడువు దగ్గర పడే కొద్దీ... హుండీల్లోకి కోట్లలో డబ్బు వచ్చి పడుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

Similar News