బాబుగారూ మీరు మారాలన్న జగన్

Update: 2017-10-14 13:24 GMT

వర్షాలు ప్రారంభంకాగానే తనవల్లనేనని చెప్పుకోవడం కాదు... గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలకు ఏపీలోని 13 జిల్లాల్లో రైతులు ఎంత నష్టపోయారో తెలుసా? అని వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఈరోజు జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల వల్ల రాయలసీమలో తీవ్ర నష్టం జరిగిందన్నారు. వేరుశెనగ, పత్తి, ఉల్లి, మిరప, మినుము, కంది, మొక్కజొన్న, ఆముదం, ఇతర నూనెగింజల పంటలు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా జలసిరికి హారతి వల్లనే వర్షాలు కురిశాయని చెప్పడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. రైతుల ఆక్రందనను పట్టించుకునే తీరిక లేకపోవడంపై జగన్ ఆవేదన చెందారు.

సమస్యలను పట్టించుకోరా?

రుణమాఫీ సక్రమంగా అమలుకాలేదని, ఇన్ పుట్ సబ్సిడీలనున ఎగ్గొట్టారని, రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు అల్లాడి పోతున్నారన్నారు. రైతు సమస్యలపై తానెన్ని సార్లు ఆందోళన చేసినా పట్టించుకోలేదని, పంటలు దెబ్బతిని రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం విదేశీయులతో ఫొటోలు దిగుతూ సన్మానాలు, సత్కారాలు చేయించుకోవడాన్ని జగన్ తప్పుపట్టారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు చంద్రబాబు వ్యవహారముందన్నారు. చంద్రబాబు గారూ ఇప్పటికైనా మీరు మారాలని జగన్ తన లేఖలో కోరారు.

Similar News